'కేసీఆర్‌'పై కోర్టుకు వెళ్లిన జగన్‌ పార్టీ

'కేసీఆర్‌'పై కోర్టుకు వెళ్లిన జగన్‌ పార్టీ

నమ్మి ఓట్లేసి ప్రజలకు న్యాయం చేసే విషయంలో పెద్దగా పట్టని జగన్‌ పార్టీ.. తన ఆస్తిత్వానికి ముప్పు ఏర్పడితే ఎంతకైనా రెఢీ అంటుందా? అంటే అవుననే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామం కూడా ఈ అభిప్రాయానికి బలం చేకూరేలా ఉండటం గమనార్హం. అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలోకి ప్రజా సమస్యలపై గళం విప్పేందుకు.. కేసీఆర్‌ సర్కారుపై పోరాడేందుకు వెనుకా మందు ఆలోచించుకునే పార్టీ.. ఇప్పుడు కేసీఆర్‌ సర్కారు మీద ఒక కేసు వేయటం విశేషం.

ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న జగన్‌ పార్టీ.. తెలంగాణలో ఆ పార్టీ బలం నామమాత్రమనే చెప్పాలి. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన ఎంపీ.. ఎమ్మెల్యేలు పార్టీ మారిన సమయంలోనూ తెలంగాణ అధికారపక్షం తీరును కడిగిపారేసింది లేదు. అలాంటి జగన్‌ పార్టీ తాజాగా మాత్రం కేసీఆర్‌ సర్కారుపై కోర్టుకు వెళ్లటం గమనార్హం. ఉన్నట్లుండి కేసీఆర్‌ సర్కారు మీద జగన్‌ పార్టీ కేసు ఎందుకు వేసిందన్న కారణాన్ని చూస్తే ఆసక్తికర కోణం కనిపిస్తుంది.

ఈ మధ్యన తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన తెలంగాణ సర్కారు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి పలు పార్టీల్ని ఆహ్వానించిన తెలంగాణ ప్రభుత్వం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని మాత్రం పిలవలేదు. రాజకీయ పార్టీగా.. ఎన్నికల్లో సీట్లు గెలుచుకున్న పార్టీగా ఉన్న తమను అఖిలపక్షానికి ఎందుకు పిలవలేదంటూ జగన్‌ పార్టీకి చెందిన కొందరునేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే.. ఆ పార్టీ ఒకప్పటి రాష్ట్ర అధ్యక్షుడు కమ్‌ ఎంపీ అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్‌ఎస్‌ లో చేరుతూ పార్టీని తెలంగాణ అధికారపక్షంలో కలిపేసినట్లుగా ప్రకటించారు. అప్పుడు ఈ విషయంపై పెద్దగా గళం విప్పని జగన్‌ పార్టీ.. తాజాగా మాత్రం కోర్టు మెట్లు ఎక్కింది.

కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఉన్న తమ పార్టీకిచెందిన ప్రతినిధులను ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశానికి పిలవలేదన్న విషయాన్ని హైకోర్టుకు దృష్టికి తీసుకెళ్లిన జగన్‌ పార్టీ నేతలు.. రాష్ట్రస్థాయిలో జరిగిన సమావేశాల్లో తమను అనుమతించకపోతే జిల్లా.. మండల స్థాయి సమావేశాలకు తమను విస్మరించే అవకాశం ఉందన్నవాపోయారు.  భవిష్యత్తులో జరిపే అఖిలపక్ష సమావేశాలకు తమను ఆహ్వానించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో కేసు వేశారు. ప్రజా సమస్యలపై గళం విప్పటానికి సంకోచించే జగన్‌ పార్టీ నేతలు.. తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు కావాలని మాత్రం పోరాటం చేస్తారన్న మాట. ప్రజాసమస్యల కంటే తమ గుర్తింపు కోసమే జగన్‌ పార్టీ నేతలు ఎక్కువ ఆరాటపడుతున్నట్లుగా కనిపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు