జనతా గ్యారేజ్.. వ్యతిరేక ప్రచారం గట్టిగానే

జనతా గ్యారేజ్.. వ్యతిరేక ప్రచారం గట్టిగానే

తిరుపతికి చెందిన వినోద్ అనే పవన్ కళ్యాణ్ అభిమాని కర్ణాటకలోని కోలార్ దగ్గర హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఇంతకీ ఆ గొడవ ఏంటి అనే విషయమై మీడియాలో ఎవరూ ఓపెన్‌గా డిస్కస్ చేయట్లేదు. వినోద్‌ను హత్య చేసిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అభిమానిగా భావిస్తున్నారు. అందుకే ఈ వ్యవహారం అంతగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఐతే తిరుపతిలో వినోద్ గురించి.. ఆ గొడవ గురించి తెలిసిన వాళ్లు చెబుతున్నదేంటంటే.. ఈ గొడవలో అసలు ‘అభిమానం’ అనే కోణమే లేదట. వాళ్లిద్దరి మధ్య వేరే గొడవలున్నాయని.. అవే హత్యకు దారి తీశాయని కూడా అంటున్నారు. ఐతే అనుకోకుండా ఈ వ్యవహారం ‘అభిమానం’ రంగు పులుముకుందని చెబుతున్నారు.

ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ వ్యతిరేక వర్గం వివాదాన్ని పెద్దది చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు.. తెలుగుదేశం పార్టీ నుంచి ఈ విషయంలో సహకారం అందుతున్నట్లు ఆరోపణలున్నాయి. గత కొన్నేళ్లుగా ఎన్టీఆర్ ప్రతి సినిమాకూ ఏదో ఒక వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. నందమూరి అభిమానుల్లో ఓ వర్గం అతడికి వ్యతిరేకంగా పని చేస్తోంది. ఎన్టీఆర్ సినిమాలు చూడొద్దంటూ మెసేజెస్ ఫార్వర్డ్ చేయడం.. ‘బాద్ షా’ నుంచి జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ‘జనతా గ్యారేజ్’ రిలీజ్‌కు ముందు ఆ సినిమాను దెబ్బ తీయడానికి వినోద్ వివాదాన్ని వాడుకుంటున్నట్లుగా ఆరోపణలున్నాయి. మరి తెర వెనుక వ్యవహారం పవన్ కళ్యాణ్‌కు తెలుసో లేదో కానీ.. ఆయన వినోద్ కుటుంబాన్ని పరామర్శించి అభిమానులకు హితవు పలుకుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో.. ‘జనతా గ్యారేజ్’పై ఆ ప్రభావం ఎంత వరకు పడుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు