వైసీపీ ఎంపిలు రాజీనామాలు చేస్తారా ? జగన్ కు పరీక్షే

అధికారంలోకి వచ్చిన సుమారు రెండేళ్ళకు జగన్మోహన్ రెడ్డికి అసలైన పరీక్ష ఎదురైంది. అదే విశాఖపట్నం స్టీల్ పరిశ్రమను కేంద్రం ప్రైవేటుపరం చేయటం. విశాఖ స్టీల్స్ ను ప్రైవేటు చేతుల్లో పెట్టేయాలని కేంద్రం ఇప్పటికే డిసైడ్ చేసేసింది. నిజానికి ఈ ఫ్యాక్టరీని బలోపేతం చేయటంపై కేంద్రం గనుక శ్రద్ధచూపిస్తే మంచి లాభాల్లో నడిచే అవకాశాలు పుష్కలంగా ఉంది. దాదాపు 90 వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధిని చూపిస్తున్న విశాక స్టీల్స్ నష్టాల్లో ఉందంటే అందుకు కేంద్రప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి.

సరే ఈ టెక్నికాలిటీస్ లోకి వెళ్ళటం ఇపుడు అనవసరం. ఎందుకంటే ఫ్యాక్టరీ నష్టాలకు ఎవరు కారణం అని ఇపుడు పోస్టుమార్టం చేయటం కన్నా దీన్ని ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవటం ఎలాగన్నదే ముఖ్యం. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారమే విశాఖలో ఉద్యోగులు, కార్మికులు ఆందోళన మొదలైపోయింది. వీరికి మద్దతుగా రాజకీయపార్టీలు కూడా జతకలిశాయి.

వైసీపీ ఎంపిలు ఎంవివి సత్యనారాయణ, సత్యవతి మాట్లాడుతూ విశాఖస్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం కాకుండా కాపాడుకుంటామన్నారు. అవసరమైతే తమ పదవులకు రాజీనామా చేయటానికి కూడా రెడీ అంటున్నారు. అలాగే వైసీపీ ఎంఎల్ఏ నాగిరెడ్డి, టీడీపీ ఎంఎల్ఏ వెలగపూడి రామకృష్ణబాబు కూడా రాజీనామాలకు వెనక్కు తగ్గేది లేదంటున్నారు. కాబట్టి మొదలైన ఆందోళన చివరకు ఉద్యమరూపు సంతరించుకుంటే కానీ కేంద్రానికి సెగతగలదు.

ఆందోళన కాస్త ఉద్యమరూపు తీసుకోవాలంటే అందుకు ముందు అధికారపార్టీ ప్రజాప్రతినిధులపైనే ఎక్కువ బాధ్యతుంది. ఆందోళన తీవ్రరూపం దాల్చకుండానే జగన్మోహన్ రెడ్డి అప్రమత్తమవ్వాలి. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయకుండా జగన్ అడ్డుకోవాలి. వెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోడితో మాట్లాడాలి కార్యచరణను రెడీ చేయాలి. లేకపోతే విశాఖస్టీల్స్ లోని కేంద్రంవాటా మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వమే కొనేసి ఫ్యాక్టరీని పూర్తిగా రాష్ట్రప్రభుత్వ సంస్ధగా మార్చేయాలి. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని డిసైడ్ అయిన జగన్ కు విశాఖస్టీల్స్ ను కాపాడుకోవటం చాలా ముఖ్యం. మరి ఏమి చేస్తారో చూడాల్సిందే.