తమ్మారెడ్డి పంచ్: చెట్టు పేరు చెప్పుకు తిరిగే హీరోలు

తమ్మారెడ్డి పంచ్: చెట్టు పేరు చెప్పుకు తిరిగే హీరోలు

కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడ్డం సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు అలవాటు. ఏ విషయంపై అయినా.. ఎవరి గురించైనా ఆయన ఓపెన్‌గా మాట్లాడగలరు.. విమర్శలు గుప్పించగలరు. అభిమానుల మధ్య గొడవల్లో భాగంగా తిరుపతికి చెందిన వినోద్ అనే కుర్రాడు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి తమ్మారెడ్డి స్పందిస్తూ.. మన హీరోల మీద విమర్శలు గుప్పించారు. ప్రస్తుత తరుణంలో ఏదైనా మంచి మాటలు చెబితే వినే పరిస్థితుల్లో మన హీరోలు లేరని.. ఇప్పుడంతా ‘చెట్టు పేరు చెప్పుకుని తిరిగే హీరోలే ఎక్కువ అయిపోయారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

అభిమానులు గొడవలు పడొద్దు అంటూ స్టేజీలెక్కి చెప్పినంత మాత్రాన ఏ ప్రయోజనం లేదని.. ఇలాంటి గొడవల్ని నివారించడానికి హీరోలందరూ ముందుకొచ్చి ఓ గట్టి నిర్ణయం తీసుకోవాలని తమ్మారెడ్డి అన్నారు. తమ అభిమాన హీరోల్లో ఎవరు గొప్ప అనే వాదనలతో మొదలై.. కత్తులతో దాడి చేసుకునే స్థాయికి విభేదాలు ముదరడం తీవ్రమైన విషయం అని.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి పెద్ద హీరోలు కలిసికట్టుగా ఏదైనా చేస్తే తప్ప ఇలాంటి సంఘనటలు ఆగవని ఆయన అన్నారు. అభిమానుల్లో ధ్వేషం పెరగడానికి సినిమాల్లో వచ్చే పిచ్చి పిచ్చి పంచ్ డైలాగులు కూడా కారణమని తమ్మారెడ్డి చెప్పారు. ప్రస్తుత హీరోలందరూ బాగా చదువుకున్నవాళ్లేనని.. ఇలాంటి డైలాగుల విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాలని.. తమ రోజుల్లోనూ అభిమాన సంఘాలున్నప్పటికీ.. ఇలాంటి దారుణమైన ఘటనలు లేవని.. తాను.. దాసరి లాంటి పెద్దవాళ్లు ఏదైనా చెబితే వినే పరిస్థితి లేదని.. హీరోలు ఈ విషయంలో పునరాలోచించుకోవాలని ఆయన అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు