ఫ్యాన్స్ గొడ‌వ‌ల‌పై ప‌వ‌న్ ప‌వ‌ర్‌ఫుల్ కామెంట్‌

ఫ్యాన్స్ గొడ‌వ‌ల‌పై ప‌వ‌న్ ప‌వ‌ర్‌ఫుల్ కామెంట్‌

టాలీవుడ్‌ హీరోలతో గొడవలపై పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తొలిసారిగా స్పందించారు. తమ మధ్య ఎప్పుడూ పోటీ వాతావరణం ఉంటుందని స్పష్టం చేసిన ఆయన ఎప్పుడూ తాము గొడవలకు దిగలేదన్నారు. అసలు గొడవలకు దిగడం ఎలాంటి సంస్కృతి అని పవన్‌ ప్రశ్నించారు. ఆదివారం కర్ణాటకలోని కోలార్‌ ప్రాంతంలో పవర్‌ స్టార్‌ అభిమానులు, ఎన్‌టీఆర్‌ అభిమానులు ఘర్షణకు దిగారు. ఈ గొడవ తీవ్రరూపం దాల్చి ఎన్‌టీఆర్‌ అభిమానుల్లో ఒకరు పవర్‌ స్టార్‌ అభిమాని అయిన తిరుపతికి చెందిన వినోద్‌ రాయల్‌ను కత్తితో పొడిచారు. తీవ్రంగా గాయపడ్డ వినోద్‌ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తిరుపతిలోని వినోద్‌ తల్లిదండ్రులు, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు పవన్‌ గురువారం తిరుపతి చేరుకున్నారు.

నేరుగా వినోద్‌ రాయల్‌ ఇంటికి వెళ్లిన పవన్‌.. రాయల్‌ చిత్రపటం ముందు పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన తల్లిని ఓదార్చారు. తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్‌.. అభిమానులు హీరోల పట్ల తమ అభిమానం ప్రదర్శించాలేకానీ.. ఇలా కొట్టుకుని చచ్చిపోవడం వరకు వెళ్లడం సహించరాని విషయమన్నారు.  టాలీవుడ్‌లోగానీ, బాలీవుడ్‌లోకానీ హీరోల మధ్య ఎప్పుడూ పోటీ తత్వం కనిపిస్తుందేకానీ.. ఇలా ఘర్షణ వాతావరణం కనిపించదన్నారు. హీరోలు ఎప్పుడూ పరస్పరం గొడవ పడకపోయినా..వారి అభిమానులు మాత్రం ఇలా గొడవలకు దిగడం బాధాకరమని పవన్‌ అన్నారు. వినోద్‌ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ఈ గొడవ వెనక ఏం జరిగింది, ఎందుకు జరిగిందనే విషయాలను కోలార్‌ పోలీసు స్టేషన్‌ నుంచి, అక్కడి వర్గాల నుంచి తెలుసుకుంటానని పవన్‌ చెప్పారు.

అభిమానం కొంతవరకే ఉండాలని, అది హద్దులు దాటితే విపత్కర పరిణామాలకు దారితీస్తుందని అన్నారు. మితిమీరిన అభిమానం హింసకు దారితీయడం సహించరానిదని ఆయన చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని, చంపుకొనేంత స్థాయికి అభిమానులు వెళ్లడం ఎవరికీ మంచిది కాదని హితవు పలికారు. ఈ ఘటనపై విచారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే అప్పుడు సీబీఐ విచారణ కోరుతామన్నారు. ఏదేమైనా.. పవన్‌ చెప్పిన విషయాలు అందరు హీరోల అభిమానులు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హీరోపై అభిమానం కన్నా ప్రాణమే గొప్పదన్న విషయాన్ని అందరూ గుర్తించాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు