పందిపిల్లతో కలిసి 'ఓపెన్ హార్ట్'కు రవిబాబు

పందిపిల్లతో కలిసి 'ఓపెన్ హార్ట్'కు రవిబాబు

రవిబాబు ఏం చేసినా వైవిధ్యంగానే ఉంటుంది. క్రూరమైన విలన్ పాత్రలు పోషిస్తున్నవాడిలో ఓ క్రియేటివ్ డైరెక్టర్ ఉన్నాడని 'అల్లరి' చూసేదాకా తెలియదు. అతడు పోషించిన పాత్రలకు.. అతను తీసిన సినిమాలకు అసలు సంబంధమే ఉండదు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా తన ప్రతి సినిమాలోనూ వైవిధ్యం చూపించడానికి తపించే రవిబాబు.. తాజాగా పంది పిల్లను లీడ్ రోల్‌కు తీసుకుని 'అదిగో' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమయ్యే 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమానికి కూడా రవిబాబు తన 'హీరో' అయిన పంది పిల్లనే ఎత్తుకుని వెళ్లడం విశేషం. ఐతే అదేదో బొమ్మ పంది అనుకోకండి. నిజమైన పంది పిల్లే. అది కూడా 'అదిగో'లో నటించిందే.

విశేషం ఏంటంటే ముప్పావుగంటకు పైగా సాగిన ఈ ప్రోగ్రాంలో పంది పిల్ల అస్సలు కిక్కురుమనలేదు. కదల్లేదు. ఒద్దిగా పడుకుంది. అది అంత కామ్‌గా ఎలా ఉంటోంది అని రాధాకృష్ణ అడిగితే.. ''పందిపిల్ల కూడా హ్యూమన్‌ బేబీ లాంటిదే. మనం పట్టుకోవడంలోనే ఉంటుంది. అది సెక్యూర్డ్‌గా ఫీలైనపుడు అసలు కదలదు'' అని సమాధానమిచ్చాడు రవిబాబు. ఇంకా 'అదిగో' సినిమా విశేషాల గురించి.. పంది పిల్లతో తన ఆటలు.. దాని ట్రైనింగ్ గురించి.. తన సినిమాల జర్నీ గురించి చాలా విషయాలు పంచుకున్నాడట రవిబాబు. ఈ ఇంటర్వ్యూ విశేషాలు ఇంకా బయటికి రాలేదు. వచ్చాక చూద్దాం రవిబాబు ఏం మాట్లాడాడో.. పంది పిల్ల ముచ్చట్లు ఏం చెప్పాడో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు