కాంట్రవర్శల్ క్రికెటర్ సినిమా వచ్చేస్తోంది

కాంట్రవర్శల్ క్రికెటర్ సినిమా వచ్చేస్తోంది

శాంతకుమారన్ శ్రీశాంత్. ఈ పేరు భారత క్రికెట్లో ఓ సంచలనం. క్రికెట్లో బాగా వెనుకబడ్డ కేరళ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి.. చిన్న వయసులోనే భారత జట్టు తరఫున అద్భుత ప్రదర్శనలు చేశాడీ ఫాస్ట్ బౌలర్. 2007 టీ20 ప్రపంచకప్.. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన రెండు భారత జట్లలోనూ అతను సభ్యుడు. ఆటతోనే కాక అనేక వివాదాలతోనూ అతను వార్తల్లో నిలిచిన వాడే. హర్భజన్ చెంపదెబ్బ వ్యవహారంలో.. ఆ పై స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో అతడి పేరు మార్మోగింది. ఐతే ఫిక్సింగ్ కుంభకోణం పుణ్యమా అని మంచి కెరీర్ నాశనమైంది. మూడేళ్లుగా ఇంటికే పరిమితమైపోయాడు శ్రీశాంత్.

కోర్టులో కేసు గెలిచినా.. మళ్లీ క్రికెట్ ఆడేందుకైతే అవకాశం లేదని తేలిపోవడంతో వేరే రంగాల వైపు చూస్తున్నాడు శ్రీ. మొన్నటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున తిరువనంతపురం నుంచి పోటీ పడి ఓడిపోయిన శ్రీశాంత్.. ప్రస్తుతం సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డాడు. అతను కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా టీమ్-5. ఇందులో శ్రీశాంత్ రాక్ స్టార్ తరహా పాత్ర పోషిస్తున్నాడట. శ్రీశాంత్ ఆల్రెడీ కొన్ని టీవీ షోల్లో తన మ్యూజికల్.. డ్యాన్స్ టాలెంట్ చూపించాడు. తెరమీదా ఆ టాలెంట్ చూపించే ఛాన్స్ దొరికింది. ఈ సినిమాలో శ్రీశాంత్ సరసన కృష్ణాష్టమి ఫేమ్ నిక్కీ గర్లాని కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి సురేష్ గోవింద్ దర్శకుడు. శ్రీ మాతృభాష మలయాళంతో పాటు తమిళం.. తెలుగు.. భాషల్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారట. ఇంతకుముందు మధుర శ్రీధర్ రెడ్డి.. శ్రీశాంత్ హీరోగా సినిమా చేయడానికి సన్నాహాలు చేశాడు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అలా కుదరకపోయినా.. టీమ్-5తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు శ్రీ..

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు