నాని జడ్జిమెంట్.. అవసరాల సెటైర్

నాని జడ్జిమెంట్.. అవసరాల సెటైర్

‘జ్యో అచ్యుతానంద’ టీంకు తాను ఆల్ ద బెస్ట్ చెప్పనని.. వాళ్లకు ‘కంగ్రాచ్యులేషన్స్’ మాత్రమే చెబుతానని అంటున్నాడు నాని. ఈ సినిమా ఫలితం మీద తనకు అంత నమ్మకం ఉందని.. సినిమా సూపర్ హిట్టవడం గ్యారెంటీ కాబట్టే తాను ముందే అభినందనలు చెబుతున్నానని అన్నాడు నాని. ఈ సినిమా ఆడియో వేడుకలో నాని చాలా సరదాగా మాట్లాడాడు. అతనేమన్నాడంటే..

‘‘నాకు తెలిసి ప్రపంచంలో అవసరాల శ్రీనివాస్ అంత సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నవాడు ఇంకొకరు కనిపించరు. వాడిది వేరే లెవెల్. వాడి సెన్సాఫ్ హ్యూమర్ గురించి ఒక ఉదాహరణ చెబుతా. జెంటిల్మన్ సినిమా షూటింగ్ సందర్భంగా నేను.. అతను కార్లో వెళ్తున్న సీన్ షూట్ చేయాలి. కారుకు ఓ వైపు కెమెరా ఫిక్స్ చేసి ఉంటుంది. ఐతే ఆ కెమెరా దెబ్బ తినకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయమని కెమెరామన్ చెప్పాడు.

నేను చాలా కాన్ఫిడెంటుగా ‘ఏం భయం లేదు.. నా జడ్జిమెంట్ స్కిల్స్ బాగుంటాయి’ అన్నాను. దానికి అవసరాల వెంటనే ‘పైసా తప్ప’ అన్నాడు. అతను వేసిన సెటైర్ అర్థం చేసుకోవడానికి నాకు రెండు నిమిషాలు పట్టింది. జోకులు పక్కనబెడితే ‘పైసా’ నాకు చాలా నచ్చిన సినిమా. కానీ నా జడ్జిమెంట్ స్కిల్స్ మీద అలాంటి సెటైర్ వేశాడు అవసరాల. అతను అంత తెలివైన వాడు. ‘జ్యో అచ్యుతానంద’ కథ నాకు తెలుసు. ఎప్పుడో నరేట్ చేశాడు. అప్పుడే ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో నాకు అర్థమైపోయింది. అందుకే ఈ టీంకు ముందే కంగ్రాట్స్ చెబుతున్నా’’ అని నాని అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు