అందరి కళ్లూ బన్నీ, సాయిధరమ్‌ల మీదే..

అందరి కళ్లూ బన్నీ, సాయిధరమ్‌ల మీదే..

ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి 61వ పుట్టిన రోజు. గత ఏడాది లాగే ఈసారి కూడా చిరు పుట్టిన రోజు వేడుకల్ని చాలా ఘనంగా ప్లాన్ చేసింది మెగా ఫ్యామిలీ. గత ఏడాది చిరుకు షష్టిపూర్తి అయితే.. ఈసారి ఆయన సినిమాల్లోకి పునరాగమనం చేసిన సంవత్సరం. అందుకే గత ఏడాదికి ఏమాత్రం తగ్గకుండా వేడుకలు చేస్తున్నారు. శిల్ప కళా వేదికలో జరిగే చిరు బర్త్ డే సెలబ్రేషన్స్‌కు ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప మెగా ఫ్యామిలీ హీరోలందరూ హాజరవుతుండటం విశేషం.

ఐతే ఈ వేడుకకు ఎవరొచ్చినా రాకున్నా.. అందరి దృష్టీ మాత్రం ఈ మధ్య అనుకోకుండా శత్రువుల్లా మారిపోయిన అల్లు అర్జున్.. సాయిధరమ్ మీదే నిలవబోతోంది. ఆ మధ్య బన్నీ.. పవన్ అభిమానులతో సున్నం పెట్టుకోవడం.. వాళ్లను హెచ్చరించడం.. ఆ తర్వాత సాయిధరమ్ మాత్రం అభిమానులకు మద్దతుగా మాట్లాడ్డం.. వాళ్లంతో కలిసి పవన్ నినాదాలు చేయడం గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో చిరు పుట్టిన రోజు వేడుకల్లో ఎవరేం మాట్లాడతారు.. వాళ్లు మాట్లాడుతున్నపుడు అభిమానులు ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తి రేపుతోంది.

గత ఏడాది చిరు పుట్టిన రోజు వేడుకల సందర్భంగానే రభస చోటు చేసుకుంది. అభిమానులు పవన్ నినాదాలతో హోరెత్తిస్తుంటే నాగబాబు ఫైర్ అయిపోయారు. తీవ్ర స్వరంతో వాళ్లను హెచ్చరించారు. అప్పట్నుంచి ఆయనపై పవన్ అభిమానుల్లో ఒక రకమైన వ్యతిరేక భావం ఏర్పడింది. ఆయన కంఠశోష వృథా అయింది. ఆ తర్వాత బన్నీ హెచ్చరికలు కూడా పని చేయలేదు. మరి ఈసారి వేడుకల్లో ఏం జరుగుతుందో.. పవన్ ఫ్యాన్స్ ఎలా రెస్పాండవుతారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు