బయ్యర్లను బయటపడేస్తాడో లేదో..?

బయ్యర్లను బయటపడేస్తాడో లేదో..?

డబ్బులొస్తే ఏ సినిమా అయినా హిట్టే. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానాల్లేవు. కానీ అన్ని సినిమాలకు ఓపెనింగ్స్‌ తో పాటు పెట్టిన బడ్జెట్‌.. కొన్న బయ్యర్‌ సంతోషం కూడా రావాలి కదా..! ఇంత స్టామినా వెంకటేశ్‌ బాబు బంగారంలో ఉందా..? పేరులో బంగారం ఉన్నంత మాత్రానా సినిమా కూడా బంగారంలా ఉండాలని లేదు. కొన్నిసార్లు గిల్టు బంగారాన్ని చూసి కూడా ఒరిజినల్‌ అని భ్రమ పడుతుంటాం. బాబు బంగారం విషయంలో ఇదే జరిగిందేమో అనుకున్నారంతా. తొలి రోజు ఈ సినిమాకు వచ్చిన టాక్‌ చూసి ఈ బంగారం తాకట్టుకు పనికిరాదు.. బయ్యర్లకు చుక్కలు కనిపించడం ఖాయం అనుకున్నారు. కానీ మారుతి మహిమో.. వెంకటేశ్‌ ఇమేజ్‌ మాయో.. నయనతార లెగ్గు ఎఫెక్టో తెలియదు గానీ బంగారం మాత్రం తొలి వారంలో అదరగొట్టాడు. ఇప్పటి వరకు వెంకీ కెరీర్‌ లో ఎన్నడూ లేని విధంగా తొలి వారంలోనే 21 కోట్ల షేర్‌.. 25 కోట్ల గ్రాస్‌ వసూలు చేసాడు బాబు బంగారం.

సినిమాకు నెగిటివ్‌ టాక్‌ వచ్చినా.. తొలి నాలుగు రోజులు హాలీడేస్‌ కావడం.. పోటీ కూడా పెద్దగా లేకపోవడం బంగారానికి కలిసొచ్చింది. వసూళ్లు చూసి చిత్రయూనిట్‌ కూడా ఫుల్‌ ఖుషీ అయిపోయి సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేసారు. కానీ నిజంగానే సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేసేంత దమ్ము బంగారం సినిమాలో ఉందా అంటే సమాధానం నో అనే చెప్పాలి. ఎందుకంటే సినిమా హిట్‌ అనిపించుకోవాలంటే ఇంకా 8 కోట్లు రావాలి. ఇప్పటికే చాలా చోట్ల సినిమా వసూళ్లు దారుణంగా పడిపోయాయి. అందుకే ఇప్పటి వరకు వచ్చిన 21 కోట్లు ఒక లెక్క.. ఇకపై రాబోయే 8 కోట్లు ఒక లెక్క. అవోస్తే గానీ బాబు గిల్ట్‌ బంగారం కాదు.. అసలని తేలేది. చూడాలి మరి.. మన బాబు బంగారం బయ్యర్లను బయటపడేస్తాడో లేదో..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు