మనమంతా.. అసలెందుకు పోయింది?

మనమంతా.. అసలెందుకు పోయింది?

మంచి సినిమా తీస్తే సరిపోదు. దాన్ని ప్రేక్షకులు ఆదరించాలి. నిర్మాతకు డబ్బులు రావాలి. ప్రశంసలు కడుపు నింపవు. సంతృప్తినివ్వవు. టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి సినిమాల విషయంలో ఎక్కడ లోపం జరుగుతోందో అర్థం కావడం లేదు. అవి అనుకున్న స్థాయిలో ఆడటం లేదు. ఎప్పుడూ కాలానికి ముందు ఉండి సినిమాలు తీస్తాడతను. అతడి ప్రతి సినిమాలోనూ కంటెంట్ ఉంటుంది. గొప్ప సినిమాల్లాగా అనిపిస్తాయి. కానీ కమర్షియల్‌గా సక్సెస్ కావు. గతంలో వచ్చిన సినిమాలు రాంగ్ టైమింగ్‌లో వచ్చాయి.. అప్పటికి తెలుగు ప్రేక్షకుల అభిరుచి మారలేదు అనుకున్నా.. ఇప్పుడు కొత్త దనానికి, మంచి సినిమాలకు పట్టం కడుతున్న సమయంలో కూడా ‘మనమంతా’ లాంటి గొప్ప సినిమా ఆడకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

ఈ మధ్య ఓ సినిమాకు పాజిటివ్ టాక్.. పాజిటివ్ రివ్యూలు వస్తే కలెక్షన్లు అంచనాల్ని మించి పోతున్నాయి. ‘పెళ్లిచూపులు’ లాంటి హైప్ లేని సినిమా ఎలా ఆడుతోందో చూస్తున్నాం. కానీ ‘మనమంతా’ విషయంలో మాత్రం ఆ మ్యాజిక్ జరగలేదు. చూసిన వాళ్లందరూ బాగుందన్నా సినిమా ఆడలేదు. ప్రమోషన్ విషయంలో ఫెయిలవ్వడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పాలి. ‘మనమంతా’ ఒక డబ్బింగ్ సినిమా అని ప్రేక్షకుల్లో ఓ అభిప్రాయం కలిగిందంటే అది కచ్చితంగా దర్శక నిర్మాతల తప్పే. సినిమా సెట్స్ మీద ఉండగానే కొంచెం ప్రమోట్ చేయాల్సింది. ఆడియో ఫంక్షన్ పెట్టి కొంచెం హడావుడి చేస్తే జనాలకు తెలిసేది. అదేమీ లేకుండా కంటెంట్ ఉన్న సినిమా.. ఆడేస్తుంది అన్న భ్రమలతో విడుదలకు ముందు ప్రమోషనే లేకుండా సినిమాను రిలీజ్ చేశారు. విడుదల తర్వాత కొన్ని రోజులకు రాజమౌళి రంగంలోకి దిగినా ఫలితం లేకపోయింది. జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. యేలేటి మరోసారి ఫెయిల్యూర్ డైరెక్టర్‌గా ముద్ర వేసుకున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English