అల్లుడు ఇప్పుడైనా ఆడుకుంటాడా..?

అల్లుడు ఇప్పుడైనా ఆడుకుంటాడా..?

సుశాంత్‌ అక్కినేని.. ఈ పేరు విని చాలా కాలమైంది కదూ..! ఎన్ని రిపేర్లు చేసినా ఇప్పటికీ సుశాంత్‌ కెరీర్‌ బండి మాత్రం గాడిన పడలేదు. కాళిదాసు, కరెంట్‌, అడ్డా సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా.. వీటిలో ఏదీ సుశాంత్‌ ఆశల్ని నిలబెట్టలేదు. దాంతో మనోడు స్టార్‌ హీరో అవ్వాలనుకునే కలలన్నీ కల్లలుగానే మిగిలిపోతున్నాయి. ఎప్పుడో తాతగారు ఉన్నపుడు అడ్డా సినిమా చేసాడు సుశాంత్‌. మళ్లీ ఇన్నాళ్లకు ఆటాడుకుందాం రా అనే సినిమాతో వస్తున్నాడు. కామెడీ సినిమాల దర్శకుడు జి నాగేశ్వరరెడ్డి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ కు మంచి రెస్పాన్సే వస్తుంది. రొటీన్‌ గానే అనిపిస్తున్నా.. కామెడీ వర్కవుట్‌ అయింది.

ఈ సినిమాలో విశేషాలు చాలానే ఉన్నాయి. ఇందులో తాత నటించిన దేవదాసు సినిమాలోని పల్లెకు పోదాం.. అనే పాటను రీమిక్స్‌ చేసాడు సుశాంత్‌. అంతేకాదు.. ఆటాడుకుందాం రాలో అక్కినేని బ్రదర్స్‌ నాగచైతన్య, అఖిల్‌ గెస్ట్‌ రోల్స్‌ లో కనిపిస్తున్నారు. నాగచైతన్య సీన్‌ లో దర్శనమిస్తుంటే.. అఖిల్‌ పాటలో స్టెప్పులేయనున్నాడు. ఎలాగైనా ఆటాడుకుందాం రాతో కచ్చితంగా కెరీర్‌ లో తొలి హిట్‌ కొట్టాలనే కసితో ఉన్నాడు సుశాంత్‌. ఆగస్ట్‌ 19న ఈ సినిమా విడుదల కానుంది. మరి చూడాలి.. అక్కినేని మేనల్లుడు జాతకం ఈ సినిమాతోనైనా మారుతుందో లేదో..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు