కేటీఆర్ ‘పెళ్లిచూపులు’ చూసి..

కేటీఆర్ ‘పెళ్లిచూపులు’ చూసి..

రాజకీయ నాయకులు ఓ సినిమా చూసి దాని గురించి స్పందించడం అన్నది అరుదుగా జరిగే విషయం. ఈ ఏడాది ఊపిరి, బిచ్చగాడు లాంటి సినిమాలకు మాత్రమే అలాంటి అవకాశం దక్కింది. తాజాగా ‘పెళ్లిచూపులు’ కూడా ఓ ప్రముఖ నాయకుడి కితాబందుకుంది. ఆ నాయకుడెవరో కాదు.. కేసీఆర్ తనయుడు, తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. మంగళవారం సాయంత్రం ఆయన రామానాయుడు స్టూడియోలో ‘పెళ్లిచూపులు’ స్పెషల్ షో వేయించుకుని చూశారు. ఆ సినిమా కేటీఆర్‌కు బాగా నచ్చేసింది. ప్రెస్ మీట్లో కొన్ిన మంచి మాటలు మాట్లాడటంతో పాటు ట్విట్టర్లోనూ ఈ సినిమా గురించి మెసేజ్‌లు పెట్టాడు కేటీఆర్.

‘‘అత్యద్భుతంగా తీసిన పెళ్లిచూపులు సినిమా చూశా. ఎన్నో రకాలుగా ఈ సినిమా చాలా కొత్తగా అనిపించింది. తరుణ్‌తో పాటు యూనిట్లో అందరికీ అభినందనలు. ఇది తప్పక చూడాల్సిన సినిమా. సందేశాలివ్వకుండానే పెళ్లిచూపులు చాలా మంచి విషయాలు చెప్పింది. సంప్రదాయ విరుద్ధమైన ప్రొఫెషన్స్.. మహిళా సాధికారత.. పారిశ్రామికాభివృద్ధి స్ఫూర్తి.. ఇంకా చాలా మంచి విషయాలపై ఈ సినిమాలో చక్కగా చెప్పారు’’ అని కేటీఆర్ ట్వీట్ చేశాడు. చిన్న సినిమాగా విడుదలైన ‘పెళ్లిచూపులు’ ఇప్పుడు పెద్ద రేంజికే వెళ్లింది. మూడో వారంలోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్బులో చేరబోతుండటం మామూలు విషయం కాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు