కొరటాల ఎలా గెస్‌ చేస్తున్నాడబ్బా

కొరటాల ఎలా గెస్‌ చేస్తున్నాడబ్బా

కొరటాల శివ 'శ్రీమంతుడు' కథ రాసేటప్పటికి కేంద్ర ప్రభుత్వం 'గ్రామాల దత్తత' అనే కాన్సెప్టును పెద్దగా ప్రచారం చేయలేదు. ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉండగా ఆ పథకం ఊపందుకుంది. 'శ్రీమంతుడు' ఆ కాన్సెప్ట్‌కు మంచి ప్రచారం తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న కాన్సెప్ట్‌ నేపథ్యంలో ఓ ఉదాత్తమైన కథ రాసి.. దాన్ని కమర్షియల్‌గా చక్కగా ప్రెజెంట్‌ చేశాడు కొరటాల. సినిమాకు కూడా ఇది బాగా కలిసొచ్చింది. మహేష్‌ బాబు ఈ సినిమా చేస్తున్న టైంలోనే రెండు గ్రామాల్ని దత్తత తీసుకోవడం.. ప్రకాష్‌ రాజ్‌ లాంటి మరికొందరు సెలబ్రెటీలు కూడా పల్లెటూళ్లను ఆదుకోవడానికి ముందుకు రావడంతో 'శ్రీమంతుడు' సినిమాకు మంచి ప్రచారం లభించింది. మొత్తానికి కొరటాల మంచి టైమింగ్‌ చూసి 'శ్రీమంతుడు' సినిమా చేశాడే అనుకున్నారంతా.

ఐతే 'శ్రీమంతుడు' విషయంలో యాదృచ్ఛికంగా అలా జరిగిపోయిందేమో అనుకున్నారు కానీ.. 'జనతా గ్యారేజ్‌' విషయంలోనూ కొరటాల మంచి టైమింగ్‌తో కథ రాయడం విశేషమే. ఈ మధ్యే తెలంగాణ ప్రభుత్వం 'హరిత హారం' అనే కార్యక్రమం మొదలుపెట్టి మొక్కలు నాటే కార్యక్రమాల్ని ఉద్ధృతంగా చేస్తోంది. ఐతే ఈ సినిమా మొదలయ్యే సమయానికి ఆ పథకం రాలేదు. మరి కొరటాలకు ఈ పథకం గురించి ముందే తెలిసి చేశాడా.. యాదృచ్ఛికంగా జరిగిపోయిందా అన్నది తెలియదు కానీ.. మొక్కల పెంపకంపై పెద్ద చర్చ నడుస్తున్న టైంలో 'జనతా గ్యారేజ్‌' రావడం విశేషమే. ఇది సినిమాకు.. ఆ పథకానికి ఉభయతారకం అయ్యేలా ఉంది. మొత్తానికి సమాజానికి చాలా ఉపయోగపడే కార్యక్రమాల నేపథ్యంలో కమర్షియల్‌ సినిమాలు చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు కొరటాల.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు