మజ్నులో ఇంకో హీరో కూడా ఉన్నాడు

మజ్నులో ఇంకో హీరో కూడా ఉన్నాడు

నిన్నో మొన్నో మొదలైనట్లుంది నాని కొత్త సినిమా 'మజ్ను'. అంతలోనే టీజర్‌ వచ్చేసింది. సెప్టెంబర్లోనే రిలీజ్‌ అంటూ జనాలకు పెద్ద షాకే ఇచ్చింది మజ్ను టీం. శుక్రవారం రిలీజైన 'మజ్ను' టీజర్‌ సినిమా మీద అంచనాల్ని పెంచింది. నాని గత సినిమాల్లాగే ఇందులోనూ హిట్టు కళ కొట్టొచ్చినట్లు కనిపించింది. టీజర్‌ రిఫ్రెషింగ్‌గా.. క్రియేటివ్‌గా అనిపించింది. ఈ నెలాఖర్లోనే 'మజ్ను' ఆడియో విడుదల చేయబోతున్నారు.

ఇక 'మజ్ను' సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటికొచ్చింది. ఇందులో యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ ఓ క్యామియో రోల్‌ చేస్తున్నాడట. అతడి పాత్ర క్లైమాక్స్‌లో వచ్చి సందడి చేస్తుందట. అది హిలేరియస్‌గా ఉంటుందని సమాచారం. మజ్ను డైరెక్టర్‌ విరించి వర్మ తొలి సినిమా 'ఉయ్యాల జంపాల'లో రాజ్‌ తరుణే హీరో అన్న సంగతి తెలిసిందే. ఆ అభిమానంతోనే ఇందులో ఈ పాత్ర చేయడానికి ముందుకొచ్చాడు రాజ్‌ తరుణ్‌.

నాని సరసన అను ఇమ్మాన్యుయెల్‌, ప్రియశ్రీ నటిస్తున్న ఈ సినిమాకు జెమిని కిరణ్‌ నిర్మాత. గోపీ సుందర్‌ సంగీత దర్శకుడు. ప్రేమలో విఫలమైన ఓ కుర్రాడిగా నటిస్తున్నాడు నాని ఇందులో. స్టాప్‌ డ్రింకింగ్‌.. స్టార్ట్‌ లవింగ్‌.. అన్న క్యాప్షన్‌తో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. సెప్టెంబరు 17న 'మజ్ను' విడుదలయ్యే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు