బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ డిసెంబర్లో షురూ

బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ డిసెంబర్లో షురూ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ఈ కాంబినేషన్ గురించి మాట్లాడితే అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన తొలి సినిమా ‘జల్సా’ అప్పట్లో ఓ సంచలనం. ఇక ‘అత్తారింటికి దారేది’ సంగతి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసిన సినిమా అది. ఈ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్లో మూడో సినిమాకు ప్రస్తుతం రంగం సిద్ధమవుతోంది.

‘అఆ’ తర్వాత పవన్ కోసమే స్క్రిప్టు వండుతున్నాడు త్రివిక్రమ్. ఈ కాంబినేషన్లో సినిమా ఖాయమైనప్పటికీ అది ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయంలో సస్పెన్స్ నడుస్తోంది కొన్ని రోజులుగా. ఐతే డాలీ దర్శకత్వంలో పవన్ కొత్త సినిమా రెండు రోజుల కిందటే సెట్స్ మీదికి వెళ్లడంతో త్రివిక్రమ్ డైరెక్షన్లో పవన్ సినిమా విషయంలోనూ ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రం డిసెంబర్లో మొదలవుతుందని సమాచారం.

వరుసగా తమ బేనర్లో త్రివిక్రమ్‌తో మూడు సినిమాలు చేసిన రాధాకృష్ణనే పవన్-త్రివిక్రమ్ సినిమాను నిర్మించబోతున్నారు. పవన్-డాలీ సినిమా నాలుగు నెలల్లోనే పూర్తి చేసేస్తారట. దాని టాకీ పార్ట్ అవ్వగానే పవన్.. త్రివిక్రమ్ సినిమాకు షిఫ్ట్ అయిపోతాడు. తమ  కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన రెండు సినిమాల్లాగే మాంచి ఎంటర్టైనర్ రెడీ చేస్తున్నాడట త్రివిక్రమ్. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడవుతాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు