‘పెళ్లిచూపులు’ భామ ఆమె పొట్టకొట్టింది

‘పెళ్లిచూపులు’ భామ ఆమె పొట్టకొట్టింది

పెళ్లిచూపులు సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా ఓ మధుర జ్నాపకంలా నిలిచిపోవడమే కాదు.. వాళ్ల జీవితాలు కూడా మారిపోతున్నాయి. నిర్మాత పెట్టుబడి మీద పది రెట్లు లాభాలందుకునేలా ఉన్నాడు. దర్శకుడికి మంచి ఆఫర్లొస్తున్నాయి. టెక్నీషియన్స్ లైఫ్ కూడా టర్న్ అయ్యేలా ఉంది. ఇక నటీనటులందరూ కూడా బాగా ఫేమ్‌లోకి వచ్చారు. హీరో విజయ్ దేవరకొండ ఆల్రెడీ చేస్తున్న రెండు సినిమాలకు మంచి క్రేజ్ వచ్చేసింది. ఇంకో రెండు పెద్ద ఆఫర్లు పట్టాడు. ఇప్పుడు హీరోయిన్ రీతూ వర్మ కూడా ‘పెళ్లిచూపులు’ పునాది మీద తన కెరీర్‌ను బాగా ప్లాన్ చేసుకుంటోంది.

రీతూ ఇండస్ట్రీకి పరిచయమై మూణ్నాలుగేళ్లయింది. బాద్‌షా, నా రాకుమారుడు, ఎవడే సుబ్రమణ్యం లాంటి సినిమాల్లో నటించినా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ‘పెళ్లిచూపులు’ సినిమాతో ఓవర్ నైట్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పుడు ఆమెకు మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. అందులో అడివిశేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా కూడా ఉంది.

‘క్షణం’ తర్వాత తొందరపడకుండా మరో మంచి స్క్రిప్టు కోసం ఎదురు చూసిన శేష్.. ఈ మధ్య రాహుల్-శశికిరణ్ అనే దర్శక ద్వయంతో ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ముందు ‘క్షణం’లో తనకు జోడీగా నటించిన ఆదా శర్మనే హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నాడు శేష్. కానీ ‘పెళ్లిచూపులు’ చూశాక మనసు మార్చుకుని రీతూకు ఛాన్సిచ్చాడు. ఐతే అసలే ఆదా కెరీర్ చాలా డల్లుగా సాగుతోంది. క్షణం తర్వాత కూడా ఆమెకు పెద్దగా అవకాశాల్లేవు. ఇలాంటి టైంలో ఓ మంచి అవకాశం వచ్చిందనుకుంటే దాన్ని రీతూ తన్నుకుపోయింది. ఇదే కాక ఇంకో రెండు మూడు మంచి అవకాశాలు రీతూ తలుపు తడుతున్నట్లు సమాచారం.