మైల్ స్టోన్ మార్కుకు చేరువలో 'పెళ్లిచూపులు'

మైల్ స్టోన్ మార్కుకు చేరువలో 'పెళ్లిచూపులు'

పెళ్లిచూపులు బాగా ఆడొచ్చని విడుదలకు ముందే అంచనా వేశారు ఇండస్ట్రీ జనాలు. కానీ ఇంత బాగా ఆడేస్తుందని మాత్రం ఎవ్వరూ అనుకోలేదు. ఏదో మల్టీప్లెక్సుల్లో.. ఎ-సెంటర్ల వరకే కలెక్షన్లు ఉంటాయని.. మిగతా చోట్ల పెద్దగా ప్రభావం ఉండదని భావించి రిలీజ్ కూడా భారీగా ఏమీ చేయలేదు. ఐతే సినిమా అంచనాల్ని మించి రెస్పాన్స్ తెచ్చుకుంది. అన్ని చోట్లా మంచి కలెక్షన్లు రాబడుతూ చాలా పెద్ద రేంజికి వెళ్తోంది. అమెరికాలో అయితే 'పెళ్లిచూపులు' కలెక్షన్లు చూసి బయ్యర్లకు కళ్లు తిరుగుతున్నాయి.
చాలా నామినల్ ప్రైస్‌కు సినిమాను దక్కించుకున్న బయ్యర్ పెట్టుబడి మీద ఎన్నో రెట్లు ఆదాయం అందుకోబోతున్నాడు. వారం రోజుల వ్యవధిలో ఈ సినిమా అమెరికాలో 4.33 లక్షల డాలర్లు వసూలు చేయడం విశేషం. విడుదలకు ముందు రోజు ప్రిమియర్లతో 17 వేల డాలర్లు వసూలు చేసిన 'పెళ్లిచూపులు' రిలీజ్ డే నుంచి అనూహ్యమైన వసూళ్లతో దూసుకెళ్తోంది.

మళ్లీ వీకెండ్ వచ్చేసింది కాబట్టి.. కొత్త సినిమాల రిలీజ్ ఉన్నప్పటికీ 'పెళ్లిచూపులు' హవా సాగుతుందనే భావిస్తున్నారు. ఈ వీకెండ్ అయ్యేలోపే హాఫ్ మిలియన్ మార్కును దాటేయడం ఖాయం. అంటే కోటిన్నర రూపాయల బడ్జెట్లో తెరకెక్కిన 'పెళ్లిచూపులు'.. ఒక్క అమెరికాలో మాత్రమే దానికంటే రెట్టింపు కన్నా ఎక్కువ వసూలు చేస్తోందన్నమాట. ఈ సినిమా ఏ స్థాయి విజయం సాధించిందో చెప్పడానికి ఇంతకంటే రుజువేముంటుంది?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు