ఆ పోలిక టూమ‌చ్ సునీల్‌

ఆ పోలిక టూమ‌చ్ సునీల్‌

ఒక హీరో అయినా.. ఒక కమెడియన్ అయినా.. ఎక్కువ మంది ప్రేక్షకులకు నచ్చితే ఇండస్ట్రీలో నిలబడతాడు. ఎక్కువమందికి నచ్చకపోయినా పర్వాలేదు.. కనీసం వ్యతిరేకత మూటగట్టుకోకుండా ఉంటే ఎలాగోలా నెట్టుకురావచ్చు. ఐతే కమెడియన్‌ గా అందరికీ చాలా ఇష్టుడైన సునీల్.. హీరోగా మారాక మాత్రం ఇలా అందరి ఆమోదం పొందలేకపోయాడు. కామెడీ టచ్ ఉన్న హీరో పాత్రలు వేసినంతవరకు పరిస్థితి బాగానే ఉంది కానీ.. రెగ్యులర్ మాస్ హీరో వేషాలు వేస్తున్నప్పట్నుంచి అతడి మీద వ్యతిరేకత మొదలైంది. సినిమా సినిమాకూ అది పెరిగిపోతోంది. పేరున్న మాస్ హీరోలే.. కొంచెం వైవిధ్యం కోసం ప్రయత్నిస్తుంటే సునీల్ మాత్రం రొడ్డకొట్టుడు సినిమాలు చేస్తూ తనపై వస్తున్న విమర్శల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకెళ్లిపోతున్నాడు. సినిమాల్లో అవసరమున్నా లేకున్నా తన డ్యాన్సింగ్.. ఫైటింగ్ టాలెంట్ చూపించడానికి తపించిపోతున్నాడు. పైగా మెగాస్టార్ చిరంజీవిని తెగ అనుకరించడానికి ట్రై చేస్తున్నాడు. అసలు సునీల్.. చిరంజీవితో తననెందుకు పోల్చుకుంటున్నాడో జనాలకు అర్థం కావడం లేదు.

కేవలం తెర మీదే కాదు.. మాటల్లో కూడా చిరుతో సునీల్ తనను పోల్చుకుంటుండం ఆశ్చర్యం కలిగించే విషయం. కొంచెం సీరియస్ నెస్ ఉన్న సినిమాలు చేయొచ్చు కదా అని సునీల్ ను అడిగితే.. ''అన్నయ్య చిరంజీవి 'ఆపద్బాంధవుడు' లాంటి మంచి సినిమా చేస్తే జనాలు చూడలేదు. కానీ 'చంటబ్బాయి'లో బాగా నవ్వించారు అన్నయ్య. ఆ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటాం. ఆ కామెడీ సీన్లు గుర్తొస్తేనే నవ్వొచ్చేస్తుంది నాకు. నేను కూడా అలాంటి సినిమాలే చేయాలనుకుంటున్నా. 'బిచ్చగాడు' కథని నాకు చెప్పారు. నేను చేయను.. అన్నాను. ఇప్పుడా సినిమా రికార్డులు సృష్టిస్తోంది కదా.. కానీ నేను చేస్తే గనుక ఫ్లాప్‌ అయ్యేది. ఎమోషన్‌ సీన్లంటే నాకు చాలా ఇష్టం. అలాంటి సీన్లు పడితే కచ్చితంగా ఏడిపిస్తా. ఆ నమ్మకం నాకుంది. కానీ నేను అలా ఏడిపిస్తే.. జనం చూడలేరు'' అని సునీల్ చెప్పాడు. సునీల్ లాజిక్కుల సంగతేంటో కానీ.. చిరుతో పోలికే టూమచ్ గా ఉంది. అయినా సునీల్ సీరియస్ సినిమాలు చేయాలని ఎవరూ అనట్లేదు. హీరోగా చేయాల్సి వస్తే 'అందాల రాముడు'.. 'మర్యాదరామన్న' తరహా కామెడీ టచ్ ఉన్న పాత్రలు చేయాలి కానీ.. కృష్ణాష్టమి-జక్కన్న తరహా రొడ్డకొట్టుడు సినిమాలు వద్దనే అందరూ అంటోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు