సునీల్ ఫేట్ మారే ఛాన్సుంది

సునీల్ ఫేట్ మారే ఛాన్సుంది

మిస్టర్ పెళ్లికొడుకు.. భీమవరం బుల్లోడు.. కృష్ణాష్టమి.. జక్కన్న.. వీటిలో దేనికి ఏదీ తీసిపోదు. పళ్లు రాలగొట్టుకోవడానికి ఏ రాయి అయితేనేం అన్నట్లుంటుంది ఈ సినిమాల సంగతి. ‘భీమవరం బుల్లోడు’ టైంకే సునీల్‌కు జ్నానోదయం అవుతుందేమో అని చూశారు జనాలు. కానీ ‘కృష్ణాష్టమి’ అంటూ ఇంకో రొడ్డకొట్టుడు సినిమాతో పలకరించాడు సునీల్. కనీసం ఆ సినిమా ఫలితం చూసైనా మారతాడేమో అనుకుంటే.. ‘జక్కన్న’ అంటూ మరో రాడ్ సినిమాతో వచ్చాడు. ఇప్పటికే హీరోగా సునీల్ విషయంలో ఉన్న వ్యతిరేకత ఈ సినిమాతో మరింత పెరిగింది. సునీల్ ఇదే తరహాలో ఇంకో సినిమా అందిస్తే.. జనాలు మరింత ఫ్రస్టేట్ అయిపోవడం ఖాయం.

ఐతే సునీల్ తర్వాతి రెండు సినిమాలు మాత్రం కొంచెం భిన్నంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సినిమాలు చేస్తున్న దర్శకుల్ని చూస్తే ఇదే అభిప్రాయం కలుగుతోంది. సునీల్ నెక్స్ట్ రిలీజ్.. ‘ఈడు గోల్డ్ ఎహే’. రచయితగా ఇండస్ట్రీకి పరిచయమైన ఆ తర్వాత దర్శకుడిగా మారి.. బిందాస్, రగడ, దూసుకెళ్తా లాంటి సినిమాల్ని అందించాడు వీరూ పోట్ల. ఈ మూడు సినిమాలు బాగానే ఆడాయి. మంచి వినోదాన్నందించాయి. కమర్షియల్ సినిమాలే చేస్తాడు కానీ.. మరీ రొటీన్‌గా లేకుండా చూసుకుంటాడు వీరూ. ఎంతో కొంత వైవిధ్యం చూపించడానికి ప్రయత్నిస్తాడు. కృష్ణాష్టమి.. జక్కన్న తరహాలో అయితే సినిమాలు తీయడు. కాబట్టి ‘ఈడు గోల్డ్ ఎహే’లో సునీల్‌ను కొంచెం భిన్నంగా చూడొచ్చు. ఇక సునీల్‌తో సినిమా తీస్తున్న మరో దర్శకుడు క్రాంతి మాధవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంతకుముందు ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి మంచి సినిమాలు అందించాడు క్రాంతి. సునీల్‌తో సీరియస్ సినిమా అయితే తీయలేడు కానీ.. కామెడీ చేసినా కొత్తగా ఉండేలా చూసుకుంటాడు. కాబట్టి ఈ రెండు సినిమాలతో సునీల్ ఫేట్ మారే అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు