అమల హజ్బెండ్ విమర్శలు తాళలేక..

అమల హజ్బెండ్ విమర్శలు తాళలేక..

ఎ.ఎల్.విజయ్ తమిళంలో పేరున్న దర్శకుడు. తెలుగు వాళ్లకూ పరిచయమే. మదరాసు పట్టణం.. నాన్న... శైవం లాంటి మంచి మంచి సినిమాలు తీశాడు. అతడి తండ్రి అళగప్పన్ పేరున్న నటుడు, నిర్మాత. ఇలాంటి బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ.. తమ ఇంటికి కోడలిగా వచ్చిన అమ్మాయికి సినిమాల్లో నటించే విషయంలో షరతులు పెడుతుందని.. ఆమె సినిమాల్లో నటిస్తా అన్నందుకే గొడవ పెట్టుకుంటుందని.. వ్యవహారం విడాకుల దాకా వెళ్తుందని అసలెవ్వరూ ఊహించరు.

విజయ్-అమల మధ్య విడాకుల కారణం అమల సినిమాల్లో నటించడమే అని వార్తలు వచ్చినపుడు.. ఇదంతా ఉత్త ప్రచారమనే అనుకున్నారు. ఎందుకంటే స్వయంగా దర్శకుడైన విజయ్.. ఆమెకు నటన విషయంలో అభ్యంతరాలు పెడతారని అనుకోం. పైగా అమలా పెళ్లి తర్వాత గ్లామర్ పాత్రలేమీ చేయలేదు. పద్ధతిగానే కనిపిస్తూ వస్తోంది. ఐతే విజయ్ తండ్రి మాత్రం అమలా సినిమాల్లో నటించడమే ఆమెతో తన కొడుకు విడాకులు తీసుకోవడానికి కారణమని తేల్చి చెప్పేయడంతో ఆయన మీద.. విజయ్ మీద తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. విజయ్ ఇంత సంకుచితంగా వ్యవహరిస్తాడా అనుకున్నారంతా.

దీంతో విజయ్‌ నోరు విప్పక తప్పలేదు. తామిద్దరం విడిపోవడం మాత్రమే వాస్తవమని.. మిగతా ప్రచారమంతా అవాస్తవమని.. తన తండ్రి ఒక టీవీ కార్యక్రమంలో బలవంతంగా ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని.. తాను మహిళల సాధికారతకు ఎంతో ప్రాధాన్యం ఇస్తానని.. తన సినిమాల్లో కూడా అమ్మాయిల క్యారెక్టర్లు అలాగే ఉంటాయని.. తామిద్దరం విడిపోవడానికి అమలా సినిమాల్లో నటించడం కారణం కాదని తేల్చి చెప్పాడు. నమ్మకం కోల్పోవడం వల్లే విడిపోవాల్సి వచ్చిందంటూ విడాకుల విషయంలో ఒక హింట్ ఇచ్చే ప్రయత్నం చేశాడతను. మరి అమలా అంతటి నమ్మక ద్రోహం ఏం చేసిందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు