అమలా మామ స్పందించాడు

అమలా మామ స్పందించాడు

మొత్తానికి అమలాపాల్-ఎ.ఎల్.విజయ్ విడిపోతున్నట్లు అధికారికంగానే తేలిపోయింది. ఈ విషయాన్ని అమలా మామ.. విజయ్ తండ్రి అయిన అళగప్పనే స్వయంగా ధ్రువీకరించారు. విడాకులకు కారణమేంటో కూడా ఆయన వెల్లడించారు. తమ ఇష్టానికి వ్యతిరేకంగా అమలా పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేయడానికి తయారవడమే విడాకులకు దారి తీసిందని ఆయన వెల్లడించారు.

‘‘పెళ్లయ్యాక నటన మానేసి ఆదర్శ భారతనారిగా ఉండాలన్న మా ఆకాంక్షను అమలా లెక్కచేయలేదు. పెళ్లైన తర్వాత కూడా సినిమాలు ఒప్పుకుంది. ఇది విజయ్‌కు నచ్చలేదు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఒక టైంలో ఇకపై సినిమాలు ఒప్పుకోనని అమల మాటిచ్చింది. కానీ ఇప్పుడు పాటలు పాడుతోంది. అంతే కాక సూర్య, ధనుష్ సినిమాల్లోనూ నటిస్తోంది. మా మాట వినకుండా కావాలనే సినిమాలు చేస్తోంది. ఈ విషయంలో విజయ్ ఆమెతో ఏం మాట్లాడాడో మాకు తెలియదు. ఐతే విజయ్, అమల విడాకులు తీసుకోబోతున్న మాట మాత్రం వాస్తవం. న్యాయపరంగానే వాళ్లిద్దరూ విడిపోతారు’’ అని అళగప్పన్ స్పష్టం చేశారు.

విజయ్‌-అమలా ‘నాన్న’ సినిమా సందర్భంగా ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత అన్న (తలైవా) సినిమా సందర్భంగా ఇద్దరి బంధం బలపడింది. రెండేళ్ల కిందట ఇద్దరూ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకునే ముందు అమలా సినిమాలు చేసే విషయంలో ఏం ఒప్పందం జరిగిందో కానీ.. ఇలాంటి కారణంతో ఇద్దరూ విడిపోవడం మాత్రం విచారించాల్సిన విషయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు