75 కోట్లు టీజర్లో కనిపిస్తున్నాయి

75 కోట్లు టీజర్లో కనిపిస్తున్నాయిరెండేళ్ల కిందట బెల్లంకొండ సురేష్ తన కొడుకు బెల్లంకొడ శ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ తీసిన సినిమాకు రూ.40 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టేయడం చూసి జనాలకు దిమ్మదిరిగిపోయింది. పెద్ద పెద్ద ఫ్యామిలీలకు చెందిన.. వందల కోట్ల ఆస్తులున్న వాళ్లు కూడా తమ పుత్ర రత్నాల కోసం ఈ స్థాయిలో ఖర్చు పెట్టలేదు. బహుశా సౌత్ ఇండియాలో ఓ కొత్త హీరో కోసం పెట్టిన అత్యధిక బడ్జెట్ ఇదే కావచ్చు. ఐతే ఆ రికార్డును ఇప్పుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్వామి దాటేస్తున్నాడు. తన కొడుకు నిఖిల్ కుమార్‌ను హీరోగా పరిచయం చేస్తూ తీస్తున్న ‘జాగ్వార్’ సినిమా కోసం ఆయన ఏకంగా రూ.75 కోట్లు పెట్టేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో సైతం రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకేసారి కన్నడతో పాటు తెలుగు టీజర్ కూడా రిలీజ్ చేశారు.

‘జాగ్వార్’ టీజర్ చూస్తుంటే ఈ సినిమాకు ఎందుకంత ఖర్చయిందో స్పష్టంగా కనిపిస్తోంది. టీజర్లో ప్రతి ఫ్రేమ్ కూడా చాలా రిచ్‌గా కనిపిస్తోంది. మిషన్ ఇంపాజిబుల్ లాంటి హాలీవుడ్ సినిమాలు.. ధూమ్ లాంటి బాలీవుడ్ సినిమాల్ని తలపించేలా ఉంది ‘జాగ్వార్’ టీజర్. బైకు మీద హీరోగారి విన్యాసాలు.. కళ్లు చెదిరే యాక్షన్ సీక్వెన్సే కనిపిస్తున్నాయి టీజర్ అంతా. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లున్నారు. కన్నడ సినిమాల్లో మునుపెన్నడూ కనిపించని స్థాయిలో రిచ్ విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అయ్యేలా ఉన్నాయి. సౌత్ ఇండియన్ టాప్ సినిమాటోగ్రాఫర్లలో ఒకడైన మనోజ్ పరమహంస మ్యాజిక్ టీజర్లో కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని రాజమౌళి శిష్యుడు.. ‘మిత్రుడు’తో దర్శకుడిగా అరంగేట్రం చేసిన మహదేవ్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించాడు. సెప్టెంబర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English