పవన్‌తో సినిమా కష్టమంటున్న కృష్ణవంశీ

పవన్‌తో సినిమా కష్టమంటున్న కృష్ణవంశీ

తెలుగు సినిమా నడత మార్చిన విలక్షణ దర్శకుల్లో కృష్ణవంశీ ఒకడు. ఒక గులాబి.. ఒక నిన్నే పెళ్లాడతా.. ఒక సింధూరం.. ఒక ఖడ్గం.. ఒక మురారి.. ఇలా కృష్ణవంశీ తీసినవి అలాంటిలాంటి సినిమాలు కావు. కథకు తగ్గట్లు అవసరమైతే స్టార్లను ఎంచుకున్నాడు కానీ.. ఎప్పుడూ స్టార్ల కోసం కథలు రాయడం.. వాళ్ల వెంటపడటం చేయలేదు కృష్ణవంశీ. గత పదేళ్లలో తన స్థాయికి తగ్గ సినిమాలు అందించని కృష్ణవంశీ.. ప్రస్తుతం సందీప్ కిషన్‌తో ‘నక్షత్రం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సందర్భంగా స్టార్లతో పెద్దగా సినిమాలు చేయకపోవడం.. పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు చెప్పాడు కృష్ణవంశీ.

‘‘పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో పని చేస్తేనే నాకు వ్యక్తిత్వం, అస్తిత్వం ఉన్నట్లా? పవన్‌ కళ్యాణ్ ఓ క్రౌడ్ పుల్లింగ్ హీరో. కొన్ని కోట్లమంది జనం అతనంటే విపరీతంగా రియాక్ట్ అవుతారు. అంటే.. అతడి సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ ఆశిస్తారు. ఆ ఎలిమెంట్స్ ఉన్న సబ్జెక్ట్ నేను చేయాలి. హీరోతో పాటు అభిమానుల్ని సంతృప్తి పరచడం కోసం సినిమా తీయాలా? నాకనిపించిన పాయింట్ మీద సినిమా తీయాలా? నా పాయింట్‌కి ఆయన సూటయ్యేట్లయితే వెళ్లి అడగడానికి రెడీ. అయినా నాకు స్టార్ అయినా నాన్ స్టార్ అయినా ఒకటే. హీరోని బట్టి నేను తగ్గను పెరగను. నేను కొన్ని సినిమాలు కథకు సూట్ కాని వాళ్లతో కూడా చేశాను. ఐతే అది చేస్తున్నప్పుడు ‘మనకిది కరెక్ట్ కాదు’ అని కూడా అనిపించింది. నేను రామ్‌చరణ్‌తో చేస్తే పెద్ద డెరైక్టర్ అన్నట్లా? సందీప్‌తో సినిమా చేస్తే చిన్న డెరైక్టర్ అన్నట్లా? నేను పడ్డానా.. పెరిగానా.. తగ్గానా అనేది తెలియడంలేదు’’ అని కృష్ణవంశీ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు