సునీల్‌ కు ఎందుకు అంత కాన్ఫిడెన్స్‌..?

సునీల్‌ కు ఎందుకు అంత కాన్ఫిడెన్స్‌..?

జక్కన్న విడుదలకు సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సునీల్‌ హీరోగా నటించిన ఈ సినిమాకు వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకుడు. ట్రైలర్‌ కొత్తగా లేకపోయినా.. కామెడీగా మాత్రం ఉంది. కొత్తదనం లేకపోయినా.. కడుపుబ్బా నవ్వించే పంచ్‌ లు కనిపిస్తున్నాయి. ఎప్పుడూ చేసే కామెడీనే కాస్త డోస్‌ పెంచేసాడు దర్శకుడు. ఈ మధ్య కృష్ణాష్టమి అని.. భీమవరం బుల్లోడని కాస్త ఫ్యామిలీ యాక్షన్‌ బాట పట్టిన సునీల్‌.. జక్కన్నతో పూర్తి కామెడీ రూట్‌ లోకి వచ్చేసాడు.

ఇక ఆ మధ్య ఆడియో వేడుకలో సునీల్‌ మాటలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఇంతకుముందు తన సినిమాల గురించి ఎప్పుడూ ఈ స్థాయిలో పొగుడుకోలేదు సునీల్‌. తన దర్శకుడ్ని కానీ.. టెక్నికల్‌ టీం ను గానీ థ్యాంక్స్‌ చెప్పి వదిలేసేవాడు. కానీ జక్కన్న విషయంలో ఎందుకో గానీ సునీల్‌ చాలా కాన్ఫిడెంట్‌ గా కనిపిస్తున్నాడు. అసలు తన కెరీర్‌ లోనే ఈ స్థాయి కామెడీ నేనెప్పుడూ చేయలేదని చెప్పాడు సునీల్‌. ఇలా చెబితే ప్రేక్షకుల్లో అంచనాలు ఇంకా పెరిగిపోతాయి. అలా పెరిగినపుడు ఏ మాత్రం వాళ్ల ఊహలకు తగ్గినా.. అసలుకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు. అది తెలిసి కూడా సునీల్‌ సినిమాపై హైప్‌ పెంచేస్తున్నాడు.

జక్కన్నలో ముఖ్యంగా డైలాగ్‌ రైటర్‌ భవానీ ప్రసాద్‌ గురించి స్పెషల్‌ గా చెబుతున్నాడు సునీల్‌. సినిమాలో పంచ్‌ డైలాగ్‌ లకు అసలు కొదవే లేదని పడీ పడీ నవ్వడం గ్యారెంటీ అని ధీమాగా చెబుతున్నాడు సునీల్‌. పైగా మర్యాద రామన్నతో సునీల్‌ కెరీర్‌ ను మార్చేసాడు రాజమౌళి. ఇప్పుడు ఆయన ముద్దు పేరునే సినిమా టైటిల్‌ గా పెట్టుకుని వస్తున్నాడు సునీల్‌. ఓ వైపు సినిమాపై నమ్మకం.. మరోవైపు రాజమౌళి సెంటిమెంట్‌ తనను ప్లాపుల నుంచి గట్టెక్కిస్తాయని బలంగా నమ్ముతున్నాడు ఈ భీమవరం బుల్లోడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు