బయ్యర్ల నావ నష్టాల నడిసంద్రంలో....

బయ్యర్ల నావ నష్టాల నడిసంద్రంలో....

ఆకాశమంత అంచనాలతో విడుదలైన కబాలికి తొలిరోజే ఊహించని విధంగా నెగిటివ్‌ టాక్‌ వచ్చింది. అయితే రజినీకాంత్‌ ఇమేజ్‌ ముందు టాక్‌ పని చేయలేదు. తలైవా ముందు నెగిటివ్‌ టాక్‌ తల దించుకుంది. దానికి ఫలితమే తొలి మూడు రోజుల్లో కబాలికి వచ్చిన వసూళ్లు. ఏకంగా ఇండియన్‌ సినిమా రికార్డులన్నీ తిరగరాస్తూ 125 కోట్లు వసూలు చేసింది కబాలి. అది కూడా గ్రాస్‌ కాదు.. షేర్‌. గ్రాస్‌ అయితే ఏకంగా 200 కోట్లు దాటిపోయింది. తెలుగులో 18 కోట్లు.. తమిళనాట 33 కోట్లు.. కేరళలో 7 కోట్లు.. కర్ణాటక 8 కోట్లు.. హిందీ 20 కోట్లు.. ఓవర్సీస్‌ 60 కోట్లకు పైగా వసూలు చేసింది కబాలి. ఇప్పటికే కొన్నిచోట్ల 80 శాతం వరకు రికవర్‌ చేసింది కబాలి.

కబాలికి మేజర్‌ మార్కెట్‌ తెలుగు, తమిళ ఇండస్ట్రీలే. ఇక్కడ కానీ సినిమా బయ్యర్లు పెట్టిన మొత్తాన్ని వెనక్కి తెస్తే రజినీకాంత్‌ నిజంగా దేవుడే. ఎందుకంటే తొలిరోజు వచ్చిన టాక్‌ తో పోలిస్తే ఇప్పటికే వచ్చిన వసూళ్లు చాలా ఎక్కువ. సినిమా ఎలా ఉన్నా పర్లేదు గానీ రజినీకాంత్‌ ను తెరపై చూడాలనుకునే వాళ్లు ఎక్కువగా ఉన్నారు. అందుకే మూడ్రోజుల్లో వసూళ్ల ప్రభంజనం సాగింది. కానీ అసలైన సోమవారం వచ్చేసరికి రజినీకాంత్‌ సైతం ఏం చేయలేకపోయాడు. చాలా చోట్ల ఈ సినిమా వసూళ్ళు దారుణంగా పడిపోయాయి.

ఇప్పటి వరకు వచ్చిన 125 కోట్లు కాదు.. ఇకపై వచ్చే 55 కోట్లే సినిమాకు కీలకం. కబాలి హిట్‌ అనిపించుకోవాలంటే 170 కోట్లు వసూలు చేయాలి. ఈ ప్రయాణానికి ఇంకా చాలా దూరంలోనే ఆగింది కబాలి. ఇప్పటి వరకు టాక్‌ తో పనిలేకుండా రజినీకాంత్‌ పడవను నడిపించాడు. కానీ ఇప్పుడు బయ్యర్ల నావ నష్టాల నడిసంద్రంలో ఆగిపోకుండా ఉండాలంటే ఏ దేవుడో కరుణించాలి. అది జరిగితే కానీ సినిమా విజయ తీరాలకు చేరదు. తమిళ నాట ఇంకా వసూళ్లు స్టడీగానే ఉన్నాయి. అది రజినీ ప్రభావం. కానీ తెలుగుతో పాటు చాలా చోట్ల వసూళ్లు తగ్గాయి. చూడాలి మరి.. చివరి వరకు కబాలి ముంచుతాడో.. తేలుస్తాడో..?