మేనమామ ప్రొడక్షన్లో నాగచైతన్య సినిమా

మేనమామ ప్రొడక్షన్లో నాగచైతన్య సినిమా

నాగచైతన్య అక్కినేని నాగేశ్వరరావుకు మాత్రమే మనవడు కాదు. రామానాయుడికి కూడా మనవడే. ఆయన కూతురు లక్ష్మినే నాగార్జున మొదట పెళ్లి చేసుకున్నాడని.. వాళ్లిద్దరి కొడుకే నాగచైతన్య అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చైతూ బాల్యం చాలా వరకు రామానాయుడు కుటుంబంలోనే సాగింది. రానా, అభిరామ్ మిగతా పిల్లలతో కలిసే పెరిగాడు చైతూ. యుక్త వయసు వచ్చాకే తండ్రి దగ్గరికి వచ్చాడు. రామానాయుడితో సహా ఆ కుటుంబంలో అందరికీ చైతూ అంటే చాలా ముద్దు.

ఐతే హీరోగా పరిచయమై ఏడెనిమిదేళ్లు అవుతున్నా సురేష్ ప్రొడక్షన్లో ఇప్పటిదాకా ఓ సినిమా చేయలేదు చైతూ. ఆ మధ్య రానా-చైతూ కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందని ప్రచారం జరిగింది కానీ.. అది కార్యరూపం దాల్చలేదు. ఐతే త్వరలో చైతూ హీరోగా తాను ఓ సినిమా నిర్మించబోతున్నట్లు సురేష్ బాబు చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి సురేష్ బాబు చెబుతూ.. ‘‘త్వరలోనే వెంకటేష్ హీరోగా ఓ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత చైతూ హీరోగా ఓ సినిమా ఉంటుంది. ఆ తర్వాత రానాతోనూ ఓ సినిమా చేయాలి’’ అని వెల్లడించాడు.

ఇక తమ బేనర్ నుంచి ఈ మధ్య తరచుగా సినిమాలు రాకపోవడంపై సురేష్ మాట్లాడుతూ.. ‘‘అవును మా బేనర్లో సినిమా వచ్చి రెండేళ్లయిపోయింది. కథల విషయంలో నేను అస్సలు రాజీ పడను. మా బేనర్‌కు ఒక పేరుంది. సినిమా తేడా వస్తే డబ్బులతో పాటు పరువు కూడా పోతుందని భయం. అందుకే ఓ కథని సినిమాగా మలిచే విషయంలో నేను చాలా సమయం తీసుకుంటా. ఇకపై తరచుగా సినిమాలు చేస్తాను’’ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు