బాబూ చైతూ.. నిద్ర లేమ్మా

బాబూ చైతూ.. నిద్ర లేమ్మా

అక్కినేని నాగచైతన్య చివరి సినిమా ‘దోచేయ్’ రిలీజై ఏడాది దాటిపోయింది. ఒక డిజాస్టర్ తిన్నాక జాగ్రత్త పడటంతో తప్పులేదు. అలాగని మరీ గ్యాప్ తీసుకుంటే అసలుకే మోసం వచ్చేస్తుంది. క్రేజీ కాంబినేషన్లతో తర్వాతి రెండు సినిమాలు బాగానే ప్లాన్ చేసుకున్నాడు చైతూ. ఓ పక్క గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘సాహసం శ్వాసగా సాగిపో’.. మరోపక్క మలయాళ బ్లాక్ బస్టర్ ‘ప్రేమమ్’ రీమేక్.. రెండూ కూడా ఆసక్తి రేకెత్తించిన సినిమాలే.

ఐతే ఈపాటికే ఈ రెండు సినిమాలూ విడుదలైపోవాల్సింది. కానీ ఒకదానితో ఒకటి పోటీ పడి వెనక్కి వెళ్తూనే ఉన్నాయి. ముందు ‘సాహసం శ్వాసగా..’ రిలీజయ్యాకే ‘ప్రేమమ్’ విడుదల చేయాలన్న షరతు పెట్టుకోవడం పెద్ద సమస్యగా మారింది. గౌతమ్ మీనన్ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడటం.. దానికి తగ్గట్లు ‘ప్రేమమ్’ కూడా ఆలస్యమవుతుండటంతో జనాలు ఫ్రస్టేట్ అవుతున్నారు.

చాలాసార్లు వాయిదా పడ్డ ‘సాహసం శ్వాసగా..’ను జులై 15న పక్కాగా రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పారు. కానీ ఆ డేటు దాటిపోయింది. వచ్చే నెల రోజుల్లో కూడా సినిమా వచ్చేలా లేదు. ఎందుకంటే స్లాట్స్ అన్నీ బుక్ అయిపోయాయి. ఆగస్టు 12న ‘జనతా గ్యారేజ్’తో ‘ప్రేమమ్’ పోటీ పడబోతున్నట్లు చెప్పారు. కానీ ఎన్టీఆర్ సినిమా వాయిదా పడ్డప్పటికీ ఆ డేటును వాడుకోలేకపోయారు. ఆ తేదీకి ‘బాబు బంగారం’ రాబోతోంది. చూస్తుంటే ఆగస్టులో సైతం చైతూ రెండు సినిమాల్లో ఒక్కటి కూడా విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. చైతూ ఇప్పటికైనా కాస్త మేల్కొని తన సినిమాల విడుదల సంగతేదో తేలిస్తే బెటర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు