ఐతే కబాలి పైరసీ ఆగిపోతుందా

ఐతే కబాలి పైరసీ ఆగిపోతుందా

చికిత్స కంటే నివారణే ఉత్తమమైన మార్గం అంటారు. 'కబాలి' నిర్మాత కలైపులి థాను కూడా ఈ మార్గాన్నే ఎంచుకున్నట్లున్నాడు. సినిమా రిలీజై.. పైరసీ అయ్యాక లబోదిబోమనడం.. పోలీసుల్ని కోర్టుల్ని ఆశ్రయించడం కన్నా ముందే ప్రమాదాన్ని ఊహించి నివారణ చర్యలకు సిద్ధమయ్యారాయన. 'కబాలి' పైరసీ కాకుండా కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేయాలంటూ థాను సినిమా విడుదలకు పది రోజుల ముందే మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ మీద విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కబాలి పైరసీ వెర్షన్‌ అప్‌ లోడ్‌ చేసే అవకాశం లేకుండా దాదాపు 170 వెబ్‌ సైట్లకు షరతులు పెడుతూ ఆదేశాలు జారీ చేసింది.

దీంతో పాటు ఎమ్మెస్వోలకు కూడా కబాలి పైరసీ వెర్షన్‌ ప్రసారం చేయొద్దంటూ హెచ్చరికలు చేసింది. ఇలా ఆదేశాలిచ్చినంత మాత్రాన పైరసీని ఆగిపోతుందనుకోవడానికేమీ లేదు కానీ.. కొంత వరకు అడ్డుకట్ట వేయడానికి మాత్రం ఆస్కారం ఉంటుంది. తమిళంలో కొన్ని వెబ్‌ సైట్లు పైరసీ సినిమాలకు బాగా ఫేమస్‌. సినిమా విడుదలైన రోజు రాత్రికే దర్జాగా పైరసీ వెర్షన్‌ అప్‌ లోడ్‌ చేసేస్తాయి. అలాంటి వెబ్‌ సైట్ల లిస్టు తయారు చేసి 'కబాలి' నిర్మాత హైకోర్టుకిచ్చాడు. కోర్టు ఆ వెబ్‌ సైట్ల లిస్టు పేర్కొంటూ తీర్పు ఇచ్చింది కాబట్టి.. పైరసీ వెర్షన్‌ పెడితే ఆ వెబ్‌ సైట్లు ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. 'కబాలి' పైరసీని అడ్డుకునేందుకు థాను స్పెషల్‌ గా ఓ టీంనే ఏర్పాటు చేశాడట. ఆ టీం సినిమా విడుదలయ్యాక పైరసీ వెర్షన్‌ కోసం ఇంటర్నెట్లో నిఘా పెడుతుంది. ఏ వెబ్‌ సైట్‌ అయినా పైరసీ వెర్షన్‌ పెట్టినట్లు కనిపిస్తే వారిపై చర్యలకు రెడీ అవుతారు. బ్లాక్‌ చేయించే ప్రయత్నం చేస్తారు. మరి ఈ చర్యలు 'కబాలి' పైరసీని ఏమేరకు అడ్డుకుంటాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు