సబ్‌టైటిల్స్‌తో చూసే బాధ తప్పిందంటున్న నాని

సబ్‌టైటిల్స్‌తో చూసే బాధ తప్పిందంటున్న నాని

సౌత్ ఇండియాలో చాలా ప్రోగ్రెసివ్‌గా ఉండే ఇండస్ట్రీల్లో మల్లూవుడ్ ఒకటి. మన దగ్గర ఇప్పుడిప్పుడే వైవిధ్యమైన సినిమాలొస్తున్నాయి కానీ.. మలయాళంలో ఎప్పట్నుంచో మంచి మంచి ప్రయోగాలు జరుగుతున్నాయి. దుల్కర్ సల్మాన్, నివిన్ పౌలీ, ఫాహద్ ఫాజల్ లాంటి హీరోలు.. నజ్రియా నజీమ్, పార్వతి, నిత్యా మీనన్ లాంటి హీరోయిన్లు వైవిధ్యమైన ఫీల్ గుడ్ సినిమాలతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తున్నారు. యువ దర్శకులు చాలా మంచి సినిమాలు అందిస్తున్నారు.

ప్రేమమ్.. బెంగళూరు డేస్ లాంటి సినిమాలు కేవలం మలయాళీలకు మాత్రమే కాదు.. సౌత్ ఇండియాలోని అన్ని భాషల ప్రేక్షకులకూ చేరువయ్యాయి. మన నగరాల్లోనూ సబ్ టైటిల్స్‌తో ఈ సినిమాలు ప్రదర్శితం కావడం విశేషం. దుల్కర్ సల్మాన్-నిత్యామీనన్ కాంబినేషన్లో వచ్చిన ‘100 డేస్ ఆఫ్ లవ్’ కూడా ఆ కోవలో వచ్చిన ఓ వైవిధ్యమైన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. మలయాళంలో సూపర్ హిట్టయిన ఈ సినిమా తెలుగులోకి కూడా అనువాదమైంది. ఈ నెలాఖర్లోనే ప్రేక్షకుల ముందుకొస్తోంది.

‘100 డేస్ ఆఫ్ లవ్’ ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన నాని ఈ సినిమాను సామాన్య ప్రేక్షకుల్లాగే సబ్ టైటిల్స్‌తో చూద్దామని అనుకున్నానని.. కానీ ఆ అవసరం లేకుండా సినిమాను తెలుగులో చూసుకునే అవకాశం కల్పిస్తున్నందుకు ఆనందంగా ఉందని చెప్పాడు. ‘‘నిత్య గురించి ఎవ‌రు ఎక్క‌డ మాట్లాడినా నాకు గ‌ర్వంగా ఉంటుంది. ఎందుకంటే తను మా సినిమా ‘అలా మొదలైంది’తోనే తెలుగులోకి అడుగుపెట్టింది. 100 డేస్ ఆఫ్ లవ్ మ‌ల‌యాళ ట్రైల‌ర్ విడుద‌లైన‌ప్పుడు చూశాను. చాలా క్యూట్‌గా అనిపించింది. స‌బ్ టైటిల్స్‌తో ఈ సినిమా చూద్దామని అనుకున్నా. కానీ అలా ఇబ్బంది పడాల్సిన పని లేదు. తెలుగులో హాయిగా చూడొచ్చు. ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా’’ అని నాని చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు