హన్సిక చేసిన గొప్ప పనికి నీరాజనం

హన్సిక చేసిన గొప్ప పనికి నీరాజనంకోట్లు సంపాదించడం గొప్ప కాదు.. అందులో కొంత అభాగ్యుల కోసం ఖర్చుచేయడంలోనే ఉంది గొప్పదనం. మన సెలబ్రెటీల్లో చాలామంది పావలా ఖర్చు పెట్టి రూపాయి ప్రచారం పొందడానికి చూసేవాళ్లే ఎక్కువమంది. కానీ ముంబయి భామ హన్సిక మొత్వాని ఈ కోవలోకి రాదు. సినిమాల్లో తొలి అడుగులు వేసే సమయంలోనే ఆమె కొందరు పిల్లల్ని దత్తత తీసుకుని వారి కోసం ఓ హోం ఏర్పాటు చేసింది. హీరోయిన్‌గా ఆమె ఎదుగుదలతో పాటే.. దత్తత తీసుకునే పిల్లల సంఖ్యా పెరిగింది. ప్రస్తుతం హన్సిక దత్తత తీసుకున్న పిల్లల సంఖ్య 50కి పైనే ఉండటం విశేషం. వారి బాగోగులన్నీ ముంబయిలో హన్సిక తల్లే చూసుకుంటుంది. హన్సిక వాళ్లకు కావాల్సిన డబ్బు సమకూరుస్తుంది.

దీంతో పాటుగా చెన్నైలోనూ హన్సిక అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుంది. కానీ వీటి గురించి ప్రచారం చేసుకోదు. ఈ మధ్య హన్సిక చడీచప్పుడు లేకుండా అర్ధరాత్రి వేళ కారేసుకుని సిటీలోకి తిరుగుతూ.. రోడ్డు మీద పడుకుని ఉన్న అనాథల దగ్గరికెళ్లి వాళ్లకు దుప్పట్లు పంచింది. ఐతే దీని గురించి ఆమె ప్రచారం ఏమీ చేసుకోలేదు. ఫొటోలు.. వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. తన పాటికి తాను సైలెంటుగా నిద్రపోతున్న వాళ్ల పక్కన ఒక్కో బెడ్ షీట్ పెట్టి వెళ్లిపోతుంటే.. ఎవరో ఆమెను గుర్తుపట్టి వీడియో తీశారు. ఆ వీడియో కూడా మసక మసకగా ఉంది. క్లారిటీ లేదు.

ఐతే అందులో ఉన్నది హన్సిక అన్న సంగతి మాత్రం అర్థమవుతోంది. నగరాల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు.. పెద్ద మనసున్న వాళ్లు ఇలా దుప్పట్లు కొని.. ఫుట్ పాత్ ల మీద పడుకున్న వాళ్ల పక్కన పెట్టి సైలెంటుగా వెళ్లిపోతుంటారు. హన్సిక కూడా అలాగే చేసింది. ఆమె గొప్ప మనసును చాటుతున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవతోంది. అందరూ ఆమెకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు