పోయిన సినిమాను సాగదీస్తున్నారుగా!

పోయిన సినిమాను సాగదీస్తున్నారుగా!

ఏదైనా సినిమాకు కాస్త నెగెటివ్ టాక్ రావడం ఆలస్యం.. బాలేవు అన్న సన్నివేశాలకు కోత పెట్టేస్తున్నారు ఈ మధ్య. తొలి రోజు లేదంటే.. రెండో రోజు బోరింగ్ సీన్స్ కట్ చేసేస్తున్నారు. ఐతే ‘రోజులు మారాయి’ సినిమా విషయంలో దీనికి భిన్నంగా జరుగుతోంది. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. ఐతే పోటీలో చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేకపోవడంతో ఓ మోస్తరుగా కలెక్షన్లు రాబడుతోంది. ఈ చిత్రానికి తాజాగా కొన్ని సన్నివేశాలు కలుపుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. జబర్దస్త్ ఫేమ్ అప్పారావు మీద తీసిన కొన్ని కామెడీ సీన్స్ సినిమాకు జోడిస్తున్నారట. వీటి నిడివి దాదాపు 8 నిమిషాలుంటుందట. ఈ సినిమా సక్సెస్ మీట్లో భాగంగా ఈ విషయం వెల్లడించారు.

ఐతే ఇక్కడో ట్విస్టు ఏంటంటే.. ‘రోజులు మారాయి’ విడుదలకు ముందు ప్రమోషన్లలో భాగంగా నిర్మాత దాసరి మారుతి మాట్లాడుతూ.. ఈ సినిమా నిడివి దాదాపు రెండు గంటల 25 నిమిషాల దాకా వచ్చిందని.. ఐతే మరో నిర్మాత దిల్ రాజు సలహా మేరకు ద్వితీయార్ధంలో దాదాపు 15 నిమిషాలు కోత విధించామని.. దీంతో సినిమా మరింత క్రిస్ప్ గా తయారైందని అన్నాడు. సినిమా విడుదలకు ముందు అలా చెప్పిన మారుతి.. సినిమా తర్వాత ఎలా మనసు మార్చుకున్నాడో చూశారా..? టైటిల్ జస్టిఫికేషన్ కోసమే ఇలా చేస్తున్నారో ఏంటో? మిర్చి.. శ్రీమంతుడు లాంటి సూపర్ హిట్ సినిమాలకు ఇలాగే కొన్ని రోజులు గడిచాక కొత్త సన్నివేశాలు జోడించారు. తమది కూడా సూపర్ హిట్ అని చాటుకోవడం కోసమే ఈ తాపత్రయమా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు