మొత్తం దిల్ రాజే చేశాడంటున్న మారుతి

మొత్తం దిల్ రాజే చేశాడంటున్న మారుతి

‘రోజులు మారాయి’ సినిమా చూశాక ఇలాంటి సినిమాతో దిల్ రాజు ఎందుకు అసోసియేట్ అయ్యాడో జనాలకు అర్థం కావడం లేదు. ఆయనకున్న గుడ్ విల్‌ను ఈ సినిమా కొంత వరకు దెబ్బ తీసింది. అందుకేనేమో.. సినిమా విడుదలయ్యాక ప్రమోషన్లలో ఎక్కడా కనిపించట్లేదు రాజు. అంతే కాక ఆ సినిమా గురించి ఎక్కడా ఓ మాట మాట్లాడలేదు. ప్రెస్ నోట్ కూడా ఇవ్వలేదు. తమ సంస్థ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లోనూ ఈ సినిమాకు సంబంధించి ఏ రకమైన ప్రమోషన్ కనిపించట్లేదు. ఐతే ‘రోజులు మారాయి’కు మరో నిర్మాత అయిన మారుతి మాత్రం ఈ సినిమాకు సంబంధించిన క్రెడిట్ అంతా దిల్ రాజుదే అంటున్నాడు.

‘రోజులు మారాయి’ సక్సెస్ మీట్లో మారుతి మాట్లాడుతూ.. తాను ఈ సినిమా సెట్స్ మీద ఉండగా ‘బాబు బంగారం’ సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నానని.. స్క్రిప్టు దర్శకుడి చేతికిచ్చేశాక ఏమీ పట్టించుకోలేదని.. ఐతే ప్రొడక్షన్ మొత్తం దిల్ రాజే దగ్గరుండి చూసుకున్నాడని వ్యాఖ్యానించాడు. ఈ మాటలు చూస్తుంటే దిల్ రాజుకు కాంప్లిమెంట్ ఇస్తున్నట్లు కాక.. ఔట్ పుట్ విషయంలో బాధ్యత అంతా ఆయనదే అన్నట్లుగా ఉంది వ్యవహారం. ‘రోజులు మారాయి’కి వచ్చిన నెగెటివ్ టాక్ పై పరోక్షంగా స్పందిస్తూ.. ఓ సినిమా సక్సెస్ అయింది లేనిది కలెక్షన్లలో తెలుస్తుందని.. తమ సినిమాకు ఇప్పటిదాకా రూ.6 కోట్ల గ్రాస్ వచ్చిందని.. దీన్ని బట్టే సినిమా ఏ స్థాయి విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చని మారుతి వ్యాఖ్యానించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు