మళ్లీ ‘క్రిష్’ సినిమా చూపిస్తున్నారుగా..

మళ్లీ ‘క్రిష్’ సినిమా చూపిస్తున్నారుగా..సూపర్ మ్యాన్ తరహా సినిమాలంటే హాలీవుడ్డోళ్లే తీయగలరు అన్న అభిప్రాయం తప్పని రుజువు చేస్తూ ‘క్రిష్’ సిరీస్ సినిమాలతో రుజువు చేశాడు రాకేశ్ రోషన్. హృతిక్ లాంటి సూపర్ హీరో తన చేతిలో ఉండటంతో అతణ్ని కథానాయకుడిగా పెట్టి తెరమీద అద్భుతమైన విన్యాసాలు చేయించాడు రాకేశ్. ‘క్రిష్ సిరీస్ సినిమాలు చూస్తే హాలీవుడ్ సినిమాలు చూస్తున్న భావనే కలుగుతుంది. ఆ సినిమాలకు ఇండియన్ ఆడియన్స్ బ్రహ్మరథమే పట్టారు. ఐతే ఈ సిరీస్‌లో మూడు సినిమాలు వచ్చేయడంతో జనాలకు కొంత మొహం మొత్తేసింది. క్రిష్-3తోనే డోస్ ఎక్కువైపోయింది. దీని తర్వాత ఇంకో సినిమా చేస్తే జనాలు పెద్దగా ఆసక్తి చూపించే పరిస్థితి లేదు. అందుకే రాకేశ్-హృతిక్‌లకు కూడా అలాంటి ఆలోచనేమీ ఉన్నట్లుగా కనిపించలేదు. ఐతే వీళ్లు ఆపేసినా.. ఏక్తా కపూర్‌కు మాత్రం మళ్లీ ఈ ‘క్రిష్’ సిరీస్ సినిమాల మీద మోజు పుట్టినట్లుంది. యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌ను హీరోగా పెట్టి.. సూపర్ మ్యాన్ తరహా సినిమా ఒకటి తీసింది ఏక్తా. ఆ సినిమానే ‘ఎ ఫ్లైయింగ్ జాట్’.

ఈ మధ్యే ‘ఫ్లైయింగ్ జాట్’ టీజర్ రిలీజ్ చేశారు. అది చూస్తే.. అచ్చం ‘క్రిష్’ సిరీస్ చూస్తున్నట్లే ఉంది. అతీంద్రియ శక్తులున్న ఓ దుష్ట విలన్.. జనాల్ని పీడిస్తుంటాడు. అరాచకాలకు పాల్పడుతుంటాడు. అప్పుడే హీరో రంగంలోకి దిగుతాడు. ‘క్రిష్’ తరహాలోనే సూపర్ మ్యాన్ డ్రెస్సేసుకుని.. ముఖానికి చిన్న మాస్కేసుకుని వచ్చేస్తాడు. విలన్ని ఢీకొట్టి.. అతడితో కలిసి ఆకాశంలోకి దూసుకెళ్తాడు. ఇద్దరూ కలిసి అక్కడ డిష్యుం డిష్యుం ఆడతారు. ఇన్నాళ్లూ హాలీవుడ్ సూపర్ మ్యాన్ సినిమాల్లో.. ‘క్రిష్’ సిరీస్ సినిమాల్లో చూసింది ఇదే. మరి ఇంతకుమించి కొత్తగా వీళ్లేం చూపిస్తారో చూడాలి. ఇందులో హాలీవుడ్ నటుడు నాథన్ జోన్స్ విలన్ పాత్ర పోషించడం విశేషం. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయిక. రెమో డిసౌజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు