వైవీఎస్ హీరో వదలనంటున్నాడే..

వైవీఎస్ హీరో వదలనంటున్నాడే..

‘లాహిరి లాహిరి లాహిరిలో..’ పోస్టర్లలో ఆ గడ్డం బాబును చూస్తే ఇతను హీరో ఏంటి అన్న ఫీలింగ్ కలిగింది జనాలకు. వైవీఎస్ చౌదరికి ఇతనేమైనా కజినా అనుకున్నారు ఆ గడ్డం అదీ చూసి. వాస్తవానికి చౌదరికి.. ఆ కుర్రాడికి ఏ సంబంధం లేదు. గడ్డం బాబు పేరు ఆదిత్య ఓం. ముంబయి నుంచి హీరోయిన్లు రావడం మామూలే కానీ.. వెరైటీగా హీరోను కూడా అక్కడి నుంచే దిగుమతి చేసుకున్నాడు చౌదరి. ‘లాహిరి లాహిరి లాహిరిలో’ హిట్టయినప్పటికీ ఆదిత్యకు గొప్ప పేరేమీ రాలేదు. ఆ తర్వాత ‘ధనలక్ష్మీ ఐ లవ్యూ’ లాంటి ఒకటీ అరా సినిమాలు చేసి కనిపించకుండా పోయాడు.

ఐతే కొన్నేళ్ల విరామం తర్వాత ఈ బాబుకి దర్శకత్వం మీద మోజు పుట్టింది. అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ నందనా సేన్ కథానాయికగా.. తాను హీరోగా ‘సైలెన్స్ ప్లీజ్’ అనే మూకీ సినిమా ఒకటి మొదలుపెట్టాడు. ఇది ‘పుష్పక విమానం’ స్థాయి సినిమా అని ప్రచారం చేసుకున్నాడు. కానీ ఆ సినిమా పూర్తి కాలేదు. విడుదలవ్వలేదు. ఆ సినిమా మొదలుపెట్టడం.. ఆపేయడం జరిగి దశాబ్దం అవుతోంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ‘ఫ్రెండ్స్ రిక్వెస్ట్’ పేరుతో ఇంకో సినిమా మొదలుపెట్టాడు.. పూర్తి చేశాడు ఆదిత్య. ఈ సినిమా శుక్రవారమే విడుదలవుతోంది. కానీ ఆ సంగతి మన జనాలకు పెద్దగా తెలియదు. ఈ సినిమా హిట్టవుతుందని.. దీని తర్వాత గ్రహాంతర వాసులకథతో మరో సినిమా మొదలుపెడతానని.. అందులో తాను సైంటిస్ట్ పాత్ర పోషిస్తానని అంటున్నాడు గడ్డం బాబు. లోకల్ కాకపోయినా.. హీరోగా సాధించిందేమీ లేకపోయినా.. బ్యాగ్రౌండేమీ లేకపోయినా.. దర్శకుడిగా సినిమా చేయడానికి నిర్మాతల్ని ఒప్పించి డబ్బులు పెట్టిస్తున్నందుకు మాత్రం ఆదిత్యను అభినందించాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు