ఈ కలెక్షన్లు చూస్తే నాని కూడా షాకవుతాడేమో

ఈ కలెక్షన్లు చూస్తే నాని కూడా షాకవుతాడేమో

‘జెంటిల్‌మన్’ సినిమాకు విడుదల రోజు చాలా మంచి టాకే వచ్చింది కానీ.. ఆ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కావడం అనుమానమే అనుకున్నారంతా. దీనికి కారణం ఇది థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన సినిమా కావడం. థ్రిల్లర్లకు ప్రేక్షకవర్గం పరిమితంగా ఉంటుంది. పైగా ఇది క్లాస్ సినిమా. మాస్ ఆడియన్స్‌కు అంతగా నచ్చకపోవచ్చని అనుకున్నారు. ఈ అంచనాలకు తగ్గట్లే ‘జెంటిల్‌మన్’ ఫస్ట్ వీకెండ్ అవ్వగానే డల్ అయిపోయింది. కలెక్షన్లలో మేజర్ డ్రాప్ కనిపించింది. దీంతో పెట్టుబడి వెనక్కి తెచ్చినా గొప్పే అనుకున్నారంతా. కానీ రెండో వీకెండ్ నుంచి ‘జెంటిల్ మన్’ అద్భుతంగా పుంజుకుని అనూహ్యమైన కలెక్షన్లు సాధించింది.

విశేషం ఏంటంటే.. రెండో వీకెండ్ కంటే కూడా మూడో వీకెండ్లో ‘జెంటిల్‌‌మన్’ కలెక్షన్లు మెరుగ్గా ఉన్నాయి. ఈ ఆదివారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో కలెక్షన్లు చూస్తే ‘జెంటిల్‌మన్’ హవా ఏ స్థాయిలో సాగుతోందో అర్థమైపోతుంది. సంధ్య 35 ఎంఎంలో ‘జెంటిల్‌మన్’ మ్యాట్నీ, ఫస్ట్ షో రెండూ కూడా ఫుల్ కావడం విశేషం. సెకండ్ షో కూడా దాదాపుగా ఫుల్లయింది. ఈ శుక్రవారం రిలీజైన ‘రోజులు మారాయి’తో పాటు పోటీలో ఉన్న ఇంకే సినిమాకు కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఆదివారం ఒక్క షో కూడా ఫుల్ కాలేదు. దీన్ని బట్టే మూడో వీకెండ్లోనూ ‘జెంటిల్‌మన్’ హవా ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. బహుశా నాని సహా ‘జెంటిల్‌మన్’ యూనిట్లో అందరూ ఈ కలెక్షన్లు చూసి ఆశ్చర్యపోతుంటారేమో. తర్వాతి వీకెండ్లో కూడా చిన్న సినిమాలే వస్తున్న నేపథ్యంలో ‘జెంటిల్‌మన్’ హవా మరో వారం కొనసాగడం ఖాయం.