బాబు కు కొత్త కష్టాలు

బాబు కు కొత్త కష్టాలు

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రో తీవ్ర వివాదంలో చిక్కుకున్న‌ట్లే క‌నిపిస్తోంది. విజయవాడ దేవాలయాల కూల్చివేతల వ్యవహారం ఇప్ప‌టికే రాష్ట్రంలో క‌ల‌క‌లం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే.  అయితే దీనిపై బీజేపీ మాతృక అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సీరియస్ అయిందని స‌మ‌చారం. దీంతో ఇప్పటివరకూ ఉదాసీనంగా వ్యవహరిస్తూ వచ్చిన బీజేపీ నేతల్లో కూడా దూకుడు మొదలయిందని అంటున్నారు. చివరకు ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్పందించి, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరించాలని ఆదేశించాల్సి వచ్చింది.

కృష్ణానదీ తీరంలో దాదాపు 45 దేవాలయాలను తెలుగుదేశం ప్రభుత్వం కూల్చివేస్తున్న వైనంపై, హిందువుల్లో ఆందోళన తీవ్రమవుతోంది. దానికి నిరసనగా నిర్వహించిన బంద్ విజయవంతం కాగా, 4న భారీ స్థాయిలో నిరాహారదీక్ష ర్యాలీకి సిద్ధమవుతున్నారు. అధికార పార్టీతో ఉన్న మొహమాటాల కారణంగా ఈ వ్యవహారంపై బిజెపి మంత్రులు, నాయకత్వం మౌనవ్రతం పాటించడంపై సొంత పార్టీ శ్రేణులతోపాటు, భక్తుల్లోనూ ఆగ్రహం వ్యక్తమయింది.

ప్రభుత్వ చర్యలకు నిరసనగా 4వ తేదీన విజయవాడలో 300మందికి పైగా ఉన్న మఠాలు, పీఠాధిపతులతో నిరాహారదీక్ష చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో వైసీపీ కూడా క్రియాశీలపాత్ర పోషిస్తోంది. తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కోసమే పురాతన ఆలయాన్ని కూల్చివేశారని వైసీపీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆలయాల కూల్చివేత వ్యవహారాన్ని, బిజెపి నేతల ఉదాసీన వైఖరిని కొందరు స్థానికులు సంఘ్ ప్రముఖుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్‌ఎస్‌ఎస్, ఆలయ కూల్చివేతల అంశంపై సీరియస్‌గా దృష్టి సారించింది. సంఘ్ రాష్ట్ర ఇన్చార్జి భరత్‌జీ, రవీంద్రరాజు కలసి కూల్చివేసిన దేవాలయాలను స్వయంగా పరిశీలించి, స్థానిక భక్తుల ఆవేదన తెలుసుకున్నారు. వీహెహీచ్‌పి, బజరంగదళ్, హిందు ఆలయ ధర్మ పరిరక్షణ సమితి నేతలు కూడా సంఘ్ నేతలను కలిసి, జరుగుతున్న దారుణాలను వారి దృష్టికి తీసుకువెళ్లి, కూల్చివేతలను అడ్డుకోవాలని కోరారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సంఘ్ ఆదేశాలతో, ఢిల్లీలో ఉన్న స‌మ‌యంలోనే చంద్రబాబునాయుడును రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు హరిబాబు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సిద్దార్ధనాధ్‌సింగ్ కలిసి, కూల్చివేతలపై చర్చించి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత, కూల్చిన ఆలయాలను తిరిగి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు హరిబాబు మీడియాకు చెప్పడం గమనార్హం. దేవాదాయ మంత్రి మాణిక్యాలరావుతో కూడా సంఘ్ నేతలు ఆరా తీసి, దిశానిర్దేశం చేశారు. దానితో ఈనెల 4న జరగనున్న క్యాబినెట్ భేటీలో కూల్చివేతల అంశాన్ని ప్రస్తావించి, తగు హామీ తీసుకుంటానని చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు