సునీల్.. భ‌లే కాంబినేష‌న్ బాబూ..!

సునీల్.. భ‌లే కాంబినేష‌న్ బాబూ..!

ఏ హీరో అయినా స‌క్సెస్ లో ఉన్న ద‌ర్శ‌కుడు కావాలనుకుంటాడు. అత‌డితోనే సినిమాలు చేయాల‌నుకుంటాడు. సునీల్ లాంటి ఫ్లాప్ హీరో అయితే క‌చ్చితంగా హిట్టిచ్చిన ద‌ర్శ‌కున్నే న‌మ్ముకోవాలి. కానీ ఇక్క‌డ అది జ‌ర‌గ‌ట్లేదు. సునీల్ కు ఇప్పుడు చేతినిండా సినిమాలున్నాయి. కానీ అందులో ఏది హిట్టిస్తుంద‌నే విష‌యంపై మాత్రం క్లారిటీ లేదు. ఎందుకంటే ఆ సినిమాల‌న్నీ సునీల్ కెరీర్ కు ఎంత అవ‌స‌ర‌మో.. స‌ద‌రు ద‌ర్శ‌కుల కెరీర్ ల‌కు కూడా అంతే అవ‌స‌రం. ఇదే ఇక్క‌డ అస‌లు ట్విస్ట్.

జ‌క్క‌న్న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సినిమాను వంశీకృష్ణ ఆకెళ్ళ తెర‌కెక్కించాడు. ర‌క్ష సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన వంశీ.. ఏడేళ్ళ త‌ర్వాత మ‌ళ్లీ సునీల్ సినిమాతో మెగాఫోన్ ప‌ట్టుకున్నాడు. ఈ సారి యాక్ష‌న్ కాకుండా కామెడీతో వ‌స్తున్నాడు వంశీ. జ‌క్క‌న్న ఈ ద‌ర్శ‌కుడి కెరీర్ కు చాలా కీల‌కం. ఇక ఈ సినిమాతో పాటు వీరుపోట్ల‌తో ఈడు గోల్డ్ ఎహే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సునీల్ కంటే కూడా వీరుపోట్ల కెరీర్ కు చాలా కీల‌కం. ఎందుకంటే ఈ ద‌ర్శ‌కుడు గతంలో చేసిన మూడు సినిమాలు యావ‌రేజ్ లే. బిందాస్, ర‌గ‌డ‌, దూసుకెళ్తా.. ల‌తో యావ‌రేజ్ దాట‌ని వీరుపోట్ల క‌నీసం సునీల్ సినిమాతో అయినా హిట్ కొట్టాల‌ని చూస్తున్నాడు.

క్రాంతిమాధ‌వ్ ప‌రిస్థితి కూడా ఇంతే. ఓన‌మాలు మంచి పేరు తెచ్చిపెట్టింది.. మ‌ళ్లీమ‌ళ్లీ ఇది రానిరోజు యావ‌రేజ్ గా నిలిచింది. ఇక ఇప్పుడు సునీల్ తో చేస్తోన్న ఉంగ‌రాల రాంబాబు సినిమాపై క్రాంతి ఆశ‌ల‌న్నీ ఉన్నాయి. ఈ సినిమాలో జాత‌కాలు న‌మ్మే కోటీశ్వ‌రుడి పాత్ర‌లో న‌టిస్తున్నాడు సునీల్. తొలి రెండు సినిమాల  మాదిరి కాకుండా కామెడీ రూట్ లోకి వ‌స్తున్నాడు క్రాంతిమాధ‌వ్. ఈ మూడు సినిమాలు ఆయా ద‌ర్శ‌కుల‌కు ఎంత ముఖ్య‌మో.. సునీల్ కెరీర్ కు కూడా అంతే. మొత్తానికి మైనస్ మైన‌స్ క‌లిస్తే ప్ల‌స్ అవుతుందంటారు. మ‌రి ఇప్పుడు సునీల్ విష‌యంలో ఇది జ‌రుగుతుందా..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు