అప్పుల కుప్ప ఏపీతో సంపన్న తెలంగాణకు పోలికేంది?

అప్పుల కుప్ప ఏపీతో సంపన్న తెలంగాణకు పోలికేంది?

విడిపోయిన తర్వాత కూడా ఏపీని పోల్చుకుంటూ మాట్లాడటం తెలంగాణ నేతలు.. అధికారులు విడిచిపెట్టటం లేదు. ప్రతి విషయానికి ఏపీ పోలిక తేవటం ఏమిటన్న ప్రశ్న పలువురు సంధిస్తున్నారు. రాజకీయ నాయకులు అంటే.. రాజకీయ అవసరాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారనుకోవచ్చు. కానీ.. ఉన్నతాధికారులు సైతం ఇదే బాటలో నడవటం ఆసక్తికరంగా మారింది. విభజన తర్వాత ఏ లెక్కన చూసినా ఆంధ్రతో తెలంగాణను పోల్చలేని పరిస్థితి.

ఎవరి దాకానో ఎందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటల్లోనే చెప్పాలంటే.. తెలంగాణ ఇప్పుడు సంపన్న రాష్ట్రం. దేశంలోనే అతి తక్కువ సంపన్న రాష్ట్రాల్లో ఒకటి. అభివృద్ధి విషయంలోనూ.. దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో పరుగులు పెడుతోంది. ఇక.. ఏపీ విషయానికి వస్తే.. ఇప్పుడా రాష్ట్రం అప్పుల కుప్ప. ఏ నెలకు ఆ నెలకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే జీతాల విషయంలోనూ లెక్కలు చూసుకోవాల్సిన దుస్థితి. అలాంటప్పుడు.. ఏపీని తెలంగాణతో ఏ కోణంలోనూ పోల్చలేని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ సర్కారు ఆర్టీసీ ఛార్జీల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై పలువురు తప్పు పట్టటం.. తీవ్రంగా విమర్శించటం తెలిసిందే. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెంచుతారేంటంటూ సూటిగా ప్రశ్నిస్తున్న ప్రశ్నలకు.. తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పొరుగున ఉన్న ఏపీలో బస్సు ఛార్జీలను ఎనిమిది నెలల కిందనే పెంచారని.. తెలంగాణలో మాత్రం ఇప్పుడే పెంచినట్లుగా చెప్పారు. పెరిగిన ఛార్జీలను చూసినా.. ఏపీ కంటే తెలంగాణలో కిలోమీటర్ కు పైసా తక్కువే ఉన్నట్లు వెల్లడించారు. ఏపీ కంటే తక్కువగానే తెలంగాణలో ఛార్జీలు పెంచినా తప్పు పట్టటాన్ని ఆయన ప్రశ్నించారు. 2006.. 2010 నుంచి 2013 వరకూ ప్రతి ఏటా ఛార్జీలు పెంచారని.. అప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయని వారంతా ఇప్పుడు తప్పు పట్టటం ఏమిటంటూ ప్రశ్నించారు. నాటి పాలన బాగోలేదని.. సొంత రాష్ట్రంలో అంతా బంగారుమయం అవుతుందన్న ఉద్దేశంతోనే కదా.. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడింది? అయినా.. మన రాష్ట్రంలో.. మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పడు కూడా ప్రజల మీద భారమేంది? ఏపీ కంటే ఛార్జీలు తక్కువని చెబుతూ.. కిలోమీటరకు పైసా చొప్పున తక్కువంటూ గొప్పలు చెబుతున్న తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్ మాటలు చాలు.. చేతలు ఎంత గొప్పగా ఉందో ఇట్టే అర్థం కావటానికి అన్నవిమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీని పోలుస్తూ పెంచిన ఛార్జీల విషయంలో కన్వీన్స్ చేసే కన్నా.. ఇంకేదైనా సముచిత కారణం చూపిస్తే బాగుండేదన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు