ఆ డైరెక్టర్ల అడ్రస్ గల్లంతయిపోయిందే..

ఆ డైరెక్టర్ల అడ్రస్ గల్లంతయిపోయిందే..

వాళ్లందరూ ఒకప్పుడు తెలుగు సినిమాను షేక్ చేసిన దర్శకులు. భవిష్యత్తులో మరింతగా తమ ముద్ర వేస్తారన్న ఆశ కలిగించారు. కానీ ఇప్పుడు వాళ్ల అడ్రస్ గల్లంతయిపోయింది. గత కొన్నేళ్ల వ్యవధిలో అలా కనుమరుగైపోయిన కొందరు దర్శకుల గురించి ఓసారి గుర్తు చేసుకుందాం.

బొమ్మరిల్లు భాస్కర్: 2000వ సంవత్సరం తర్వాత వచ్చిన గొప్ప తెలుగు సినిమాల్లో ‘బొమ్మరిల్లు’ ఒకటి. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగా మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాతో ప్రామిసింగ్ డైరెక్టర్‌ లాగా కనిపించిన బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పుడు అడ్రస్ లేడు. రెండో సినిమా ‘పరుగు’తో మెప్పించినా.. ‘ఆరెంజ్’ కొట్టిన దెబ్బకు ఒక్కసారిగా లైమ్ లైట్లోంచి వెళ్లిపోయాడు భాస్కర్. ఆ తర్వాత తన శైలికి భిన్నంగా తీసిన మాస్ మసాలా సినిమా ‘ఒంగోలు గిత్త’ కూడా నిరాశ పరచగా.. ఈ మధ్యే తమిళంలో చేసిన ‘బెంగళూరు డేస్’ రీమేక్ అతడి కెరీర్‌కు ‘ఎండ్’ కార్డు వేసేసింది. ఇప్పుడు చేతిలో ఒక్క అవకాశమూ లేక కనుమరుగైపోయాడు భాస్కర్.

దేవా కట్టా: ‘వెన్నెల’ లాంటి మాంచి ఎంటర్టైనర్‌తో దర్శకుడిగా పరిచయమయ్యాడు దేవా కట్టా. ఆ తర్వాత తొలి సినిమాకు పూర్తి భిన్నంగా అతను తెరకెక్కించిన ‘ప్రస్థానం’ తెలుగు పరిశ్రమలో పెద్ద సంచలనమే అయింది. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ కాకపోయినా.. తెలుగులో వచ్చిన గొప్ప సినిమాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. థియేటర్ల నుంచి వెళ్లిపోయాకే ఈ సినిమా గొప్పదనమేంటో జనాలకు తెలిసింది. డీవీడీలు కొని చూశారు.. టీవీల్లో వచ్చినపుడు అతుక్కుపోయారు. ఈ సినిమా తర్వాత దేవా కట్టా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ‘ఆటోనగర్ సూర్య’తో తన మీద పెట్టుకున్న ఆశల్ని వమ్ము చేశాడు దేవా. దీని తర్వాత ‘డైనమైట్’ లాంటి రీమేక్ చేయడం పెద్ద తప్పిదం. ఆ సినిమా హిట్టయినా అతడికి మంచి పేరేమీ వచ్చేది కాదు. కానీ ఫ్లాపవడంతో చాలా చెడ్డ పేరు మాత్రం వచ్చింది. ఇప్పుడు సినిమాల్లేక ఖాళీ అయిపోయాడీ టాలెంటెడ్ డైరెక్టర్.

వైవీఎస్ చౌదరి: గత పాతికేళ్లలో వచ్చిన తెలుగు దర్శకుల్లో మోస్ట్ డేరింగ్ ఎవరంటే మరో మాట లేకుండా వైవీఎస్ చౌదరి పేరే చెప్పాలి. దర్శకుడిగా అతడి పనైపోయిందనుకున్న టైంలో సొంతంగా ‘బొమ్మరిల్లు’ బేనర్ పెట్టి.. హరికృష్ణను హీరోగా పెట్టి భారీ బడ్జెట్లో ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమా తీసి.. చాలా పెద్ద సాహసమే చేశాడు చౌదరి. ఆ సినిమా సంచలన విజయం సాధించి చౌదరి సాహసానికి తగ్గ ఫలితాన్నే ఇచ్చింది. ఆ తర్వాత సీతయ్య.. దేవదాసు.. లాంటి రిస్కీ ప్రాజెక్టులే చేశాడతను. వాటికి కూడా మంచి రిజల్టే వచ్చింది. కానీ కాన్ఫిడెన్స్ కాస్తా ఓవర్ కాన్ఫిడెన్స్‌గా మారి.. ఒక్కమగాడు, సలీమ్, రేయ్ లాంటి సినిమాలు తీసి నిండా మునిగాడు చౌదరి. ముఖ్యంగా ‘రేయ్’ అతణ్ని కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. ఆస్తులమ్ముకుని ఇండస్ట్రీ నుంచే అంతర్ధానమయ్యే పరిస్థితికి వచ్చాడు. త్వరలో ఇంకో సినిమా అన్నవాడు.. ఏడాదిగా ఎక్కడా కనిపించట్లేదు.

మెహర్ రమేష్: తొలి సినిమాకే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో.. అశ్వనీదత్ లాంటి టాప్ ప్రొడ్యూసర్‌తో పని చేసే అవకాశం ఎంతమందికి వస్తుంది..? పూరి జగన్నాథ్ శిష్యుడు మెహర్ రమేష్ ఈ అద్భుత అవకాశాన్ని దక్కించుకున్నాడు ‘కంత్రి’తో. సినిమా ఏవరేజ్‌గా ఆడినా.. ప్రభాస్‌తో ‘బిల్లా’ చేసే ఛాన్స్ దొరికింది. ఈ రీమేక్ మూవీ కూడా ఏవరేజ్ స్థాయిని దాటకపోయినా.. మళ్లీ ఎన్టీఆర్-అశ్వనీదత్ కాంబినేషన్లో ‘శక్తి’ లాంటి బిగ్ బడ్జెట్ మూవీ చేసే ఛాన్స్ కొట్టేశాడు మెహర్. కానీ అది పెద్ద డిజాస్టర్ అయింది. అయినా మళ్లీ విక్టరీ వెంకటేష్‌తో ‘షాడో’ లాంటి పెద్ద సినిమా చేసే అవకాశం అందుకున్నాడు. కానీ ఈసారి కూడా ఫలితం మారలేదు. దెబ్బకు మెహర్ అడ్రస్ గల్లంతైపోయింది. ‘షాడో’ తర్వాత రవితేజతో సినిమా తీద్దామని చూశాడు కానీ.. అతను దండం పెట్టేశాడు. మిగతా హీరోలెవ్వరూ కూడా మెహర్‌కు అవకాశమివ్వలేదు.

విజయ్ భాస్కర్: స్వయంవరం.. నువ్వే కావాలి.. నువ్వు నాకు నచ్చావ్.. మన్మథుడు.. మల్లీశ్వరి.. తెలుగులో చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సినిమాలివి. ఈ చిత్రాలన్నింటికీ దర్శకుడు విజయ భాస్కరే. త్రివిక్రమ్ రచన.. విజయ భాస్కర్ దర్శకత్వం.. రెండూ సూపర్ హిట్ కాంబినేషన్. కానీ ‘జై చిరంజీవ’ తర్వాత విజయ భాస్కర్‌కు త్రివిక్రమ్ దూరమయ్యాడు. ఆయనకు సక్సెస్ కూడా దూరమైంది. త్రివిక్రమ్ లేకుండా క్లాస్ మేట్, భలే దొంగలు, మసాలా లాంటి సినిమాలు చేశాడు విజయభాస్కర్. ఆ మూడూ రీమేక్‌లే. ఒక్కటీ ఆడలేదు. సొంత కథతో చేసిన ‘ప్రేమ కావాలి’ పర్వాలేదనిపించుకుంది. ‘మసాలా’ తర్వాత ఆయన్నుంచి మరే సినిమా రాలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు