కోలీవుడ్ బ్యాడ్ బాయ్.. మరో సెన్సేషన్

కోలీవుడ్ బ్యాడ్ బాయ్.. మరో సెన్సేషన్

కోలీవుడ్లో ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో సావాసం చేసే హీరో శిలంబరసన్ అలియాస్ శింబు. అతను నిజానికి మంచి నటుడు. అవకాశాలకు ఎప్పుడూ లోటుండదు. పేరున్న దర్శకులు అతడితో పని చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఆ అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుని సరిగ్గా కెరీర్‌ను ప్లాన్ చేసుకుని ఉంటే ఇప్పటికే అతడి రేంజే వేరుగా ఉండేది. కానీ లవ్ ఎఫైర్లు.. బీప్ సాంగ్.. డిస్ట్రిబ్యూటర్లతో గొడవలు.. ఇలా అనవసరమైన కాంట్రవర్శీలతో కెరీర్‌ను దెబ్బ తీసుకున్నాడు. ఐతే ఈ మధ్య చాన్నాళ్ల వాయిదా తర్వాత విడుదలైన శింబు సినిమా ‘ఇదు నమ్మ ఆళు’ సూపర్ హిట్టవడంతో మళ్లీ అతడి కెరీర్‌కు ఓ ఊపొచ్చింది. ఈ ఊపులో ఇక వివాదాలన్నీ మానుకుని బుద్ధిగా సినిమాలు చేసుకోవాలని ఫిక్సయినట్లున్నాడు శింబు.

ఆల్రెడీ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘సాహసం శ్వాసగా సాగిపో’ తమిళ వెర్షన్‌ను పూర్తి చేశాడు శింబు. ఆ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొస్తుంది. మరోవైపు ‘త్రిష ఇల్లాన నయనతార’ ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ‘ఎఎఎ’ అనే సినిమా చేస్తున్నాడు శింబు. ఈ ‘ఎఎఎ’ అంటే అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ (ప్రేమించేవాడు.. భయపడనివాడు లొంగనివాడు) అని అర్థం. ఈ మధ్య ఈ సినిమా పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. అందులో శింబు ఏమీ కనిపించలేదు. ఐతే ఏదో సైంటిఫిక్ థ్రిల్లర్ అన్నట్లు వైవిధ్యంగా పోస్టర్ డిజైన్ చేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ అయింది. విశేషం ఏంటంటే.. ఈ సినిమా కోసం శింబు 95 కిలోలు బరువు పెరుగుతున్నాడట. కెరీర్లో ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా కనిపిస్తాడట శింబు. తన కెరీర్లో ఇదో ప్రత్యేకమైన సినిమా అవుతుందని శింబు ఆశిస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు