బన్నీని నమ్ముకుని బలైపోయాడే..

బన్నీని నమ్ముకుని బలైపోయాడే..

పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ కొట్టాక హరీష్ శంకర్ పేరు మార్మోగిపోయింది టాలీవుడ్లో. అతడితో సినిమా చేయడానికి చాలామంది స్టార్ హీరోలు పోటీ పడ్డారు. అందులో అల్లు అర్జున్ కూడా ఒకడు. ఐతే ముందు జూనియర్ ఎన్టీఆర్ తో ‘రామయ్యా వస్తావయ్యా’ కమిటైన హరీష్.. దాని తర్వాత బన్నీతో సినిమా చేయాలనుకున్నాడు. కానీ ‘రామయ్యా..’ రిజల్ట్ చూశాక బన్నీ మనసు మారిపోయింది. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ కథ చెబితే తిరస్కరించాడు. పరిస్థితేంటో అర్థమయ్యాక తనేంటో నిరూపించుకున్నాకే బన్నీని కలుద్దామనుకున్నాడు హరీష్. ‘సుబ్రమణ్యం..’ సినిమాను సాయిధరమ్ తో చేశాడు. ఓ మోస్తరు సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు బన్నీని మెప్పించి సినిమా ఓకే చేసుకున్నాడు.

ఐతే హరీష్ కు న్యాయం చేసే క్రమంలో బన్నీ ఇంకో దర్శకుడికి అన్యాయం చేసేశాడు. తమిళ దర్శకుడు లింగుస్వామి బన్నీ కొట్టిన దెబ్బకు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఈ దర్శకుడికి కోలీవుడ్లోనూ చాలా కాలంగా కలిసి రావట్లేదు. రెండేళ్ల కిందట సూర్యతో చేసిన ‘అంజాన్’ పెద్ద డిజాస్టర్ అయింది. అప్పట్నుంచి ఏ స్టార్ హీరో కూడా అతడితో పని చేయడానికి సిద్ధంగా లేడు. ఈ పరిస్థితుల్లో విశాల్ తో ‘పందెం కోడి-2’ చేయాలని నిర్ణయించుకున్నాడు లింగుస్వామి. తనకు హీరోగా లైఫ్ ఇచ్చాడన్న కృతజ్నతతో మొహమాటంగానే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు విశాల్.

ఐతే ఈ లోపు బన్నీకి మరో కథ చెప్పగా.. అతను ఓకే అనేయడంతో తన కెరీర్ కు ఇది మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని భావించి.. పందెంకోడి-2 పక్కనబెట్టేసి బన్నీతో ద్విభాషా చిత్రం చేయడానికే మొగ్గు చూపాడు లింగుస్వామి. పూర్తి స్థాయి స్క్రిప్టు రెడీ చేసుకునే పనిలో ఉండగా ఇప్పుడు బన్నీ హరీష్ శంకర్ ను ఎంచుకుని లింగుస్వామికి షాకిచ్చాడు. దీని తర్వాతైనా లింగుస్వామితో పని చేస్తాడన్న గ్యారెంటీ లేదు. ఆల్రెడీ వచ్చే ఏడాది వేసవి తర్వాత విక్రమ్ కుమార్ సినిమాకు హామీ ఇచ్చేశాడు. కాబట్టి లింగుస్వామికి మొండిచేయి చూపించినట్లే. మరి హరీష్ కు న్యాయం చేసినట్లు మళ్లీ భవిష్యత్తులో ఎప్పుడైనా లింగుస్వామికి కూడా ఛాన్సిస్తాడేమో చూడాలి బన్నీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు