ఒక మనసు.. రికార్డు సాధించింది

ఒక మనసు.. రికార్డు సాధించింది

టాక్ అంత బ్యాడ్ గా ఉంటే.. ఈ రికార్డు మాటలేంటి కామెడీ కాకపోతే అంటారా..? ఇది మరో రకమైన రికార్డులెండి. టాలీవుడ్ చరిత్రలోనే సినిమా విడుదలయ్యాక అత్యంత వేగంగా సక్సెస్ మీట్ పెట్టిన రికార్డు ‘ఒక మనసు’ టీంకే దక్కుతుందని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. నిన్న మార్నింగ్ షోతో ‘ఒక మనసు’ రిలీజవ్వగా.. మధ్యాహ్నం తర్వాత మ్యాట్నీ షో నడుస్తుండగానే ‘ఒక మనసు’ సక్సెస్ మీట్ మొదలైపోయింది.

ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన మెగా అమ్మాయి కొణిదెల నిహారిక.. తన అన్నయ్య వరుణ్ తేజ్‌తో కలిసి చిరంజీవి బ్లడ్ బ్యాంకులో జరిగిన సక్సెస్ మీట్లో పాల్గొంది. చిరు అభిమానులే ఈ సక్సెస్ మీట్ నిర్వహించారు. ‘ఒక మనసు’ విజయోత్సవం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిహారిక, వరుణ్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఐతే వాళ్ల ముఖాల్లో అంత ఉత్సాహమైతే కనిపించలేదన్నది నిజం లెండి. ఈ వేడుకల్లో దర్శక నిర్మాతలెవరూ పాల్గొనకపోవడం విశేషం.

సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినపుడే ఇలా అత్యవసరంగా సక్సెస్ మీట్లు అవీ పెట్టి హడావుడి చేస్తుంటారు. ఐతే రెండో రోజో మూడో రోజో ఇలాంటి కార్యక్రమాలు పెడుతుంటారు కానీ.. మరీ ఒక్క షో పూర్తయిందో లేదో అంతలోనే విజయోత్సవం నిర్వహించడం మాత్రం ఎప్పుడూ చూసి ఉండం. ఇలాంటి వాటి వల్ల విమర్శలు వస్తాయి తప్ప ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు. ఈ సంగతి ఫిలిం మేకర్స్ గుర్తుంచుకుంటే బెటర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు