ఉపేంద్ర సినిమా.. కోరుకున్నదే జరిగింది

ఉపేంద్ర సినిమా.. కోరుకున్నదే జరిగింది

'బ్రాహ్మణ' అనే పేరు పెట్టి ఓ వయొలెంట్ సినిమా తీస్తే.. హీరోయిన్ల అందాలతో వల వేస్తే వివాదం మొదలవకుండా ఉంటుందా..? ఆ నిర్మాతకు ఆమాత్రం ఐడియా లేకుండా టైటిల్ ప్రకటించి ఉంటాడా..? ఫ్రీ పబ్లిసిటీ కోసమే ఈ టైటిల్ పెట్టాడని ఆమాత్రం అర్థం చేసుకోలేమా..?ఇప్పుడు చూడండి వాళ్లు కోరుకున్నదే జరుగుతోంది. టైటిల్ మార్చాలంటూ బ్రాహ్మణ సంఘాలు ఆందోళన మొదలుపెట్టేశాయి.

ఉపేంద్ర హీరోగా నటించిన కన్నడ సినిమా 'శివం'ను తెలుగులో 'బ్రాహ్మణ' పేరుతో అనువాదం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టైటిల్.. ఈ సినిమా పోస్టర్లు చర్చనీయాంశం అయ్యాయి. ఈ టైటిల్ మీద కచ్చితంగా వివాదం చెలరేగుతుందని అందరూ అంచనా వేశారు. అనుకున్నట్లే.. టైటిల్ మార్చాలంటూ.. ఇలా సినిమాకు కులం పేరు 'టైటిల్'గా పెట్టడం తమ మనోభావాల్ని కించపరచడమే అని 'బ్రాహ్మణ్స్ యూనిట్ ఫర్ ఎవర్' సంస్థ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ టైటిల్ అనుమతించొద్దంటూ ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారి తుమ్మా విజయ్కుమార్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఇప్పటికే బ్రాహ్మణులపై అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయని.. సినిమాల్లో బ్రాహ్మణుల్ని కించపరిచేలా సన్నివేశాలు పెడుతున్నారని.. తమ వేష, భాషలను అపహాస్యం చేస్తున్నారని.. ఇప్పుడు ఏకంగా టైటిలే 'బ్రాహ్మణ' అని పెట్టడం ద్వారా శ్రుతి మించారని వారు అన్నారు. చివరికి ఈ టైటిల్ కచ్చితంగా మార్చాల్సి వస్తుందని అందరికీ తెలుసు. ఆలోపు బ్రాహ్మణ సంఘాలు మరింతగా ఆందోళన స్వరం పెంచితే.. వీలైతే ఈ పోస్టర్లను చించే పని కూడా పెట్టుకుంటే కావాల్సింత పబ్లిసిటీ అన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు