బ్రహ్మానందం.. కాస్త గుర్తుపెట్టుకోండి బాస్

బ్రహ్మానందం.. కాస్త గుర్తుపెట్టుకోండి బాస్

మంచి బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలు కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా తట్టుకుంటారు. ఓ దశాబ్దం పాటు హిట్టు లేకున్నా నిలబడగలుగుతారు. అలాంటి హీరోలు మన దగ్గర కొదవేమీ కాదు. కానీ కమెడియన్లు మాత్రం ఏళ్ల తరబడి కొనసాగడం అన్నది చాలా చాలా కష్టమైన విషయం. అటు తమిళంలో చూసినా.. ఇటు హిందీలో చూసినా.. కమెడియన్లకు ఓ పది పదిహేనేళ్లకు మించి పీక్స్ లో కొనసాగే అవకాశం దక్కలేదు. ఐతే మన తెలుగులో మాత్రం ఒక్క బ్రహ్మానందం మాత్రమే దాదాపు మూడు దశాబ్దాల పాటు కమెడియన్ గా పీక్స్ చూశాడు.

2000 సంవత్సరం తర్వాత కొంచెం జోరు తగ్గినట్లు కనిపించినా.. పూర్తిగా వెనకబడనైతే వెనకబడలేదు. త్రివిక్రమ్.. శ్రీను వైట్ల సినిమాల హోరు మొదలయ్యాక మళ్లీ జోరందుకున్నాడు బ్రహ్మి. గత దశాబ్ద కాలంలో ఆయన ఇంతింతై అన్నట్లు ఎదిగిపోయి.. హీరోలతో సమానంగా ఇమేజ్ సంపాదించాడు. కొన్ని సినిమాలు ఆయన వల్లే హిట్టయ్యాయి. ఇంకొన్ని సినిమాల రేంజి పెరిగింది అంటే ఆశ్చర్యమేమీ లేదు. ఓసారి బ్రహ్మి పనైపోయింది అనుకున్నాక ఆయన అందుకున్న శిఖరాలు చూసి.. ఇక ఎప్పటికీ ఆయనకు తిరుగులేదనే అనుకున్నారంతా. కానీ గత రెండేళ్లలో పరిస్థితి మారిపోయింది. వరుసగా ఆయన క్యారెక్టర్లన్నీ తుస్సుమంటూ వెళ్లాయి. క్రమంగా లైమ్ లైట్లోంచి వెళ్లిపోయాడాయన. ముందు చిన్నగా మొదలైన నెగెటివిటీ అంతకంతకూ పెరిగిపోయి.. బ్రహ్మిని ఇండస్ట్రీ అంతా దాదాపుగా పక్కనబెట్టేసింది. గతంలో ఏదైనా పెద్ద సినిమాలో బ్రహ్మి లేకుంటే ఆశ్చర్యపోయేవాళ్లు. కానీ ఇప్పుడు ఆయన ఉంటే ఆశ్చర్యపోవాల్సి వస్తోంది.

‘సర్దార్ గబ్బర్ సింగ్’.. ‘సరైనోడు’ సినిమాల్లో బ్రహ్మి ఉన్నా ఆయన క్యారెక్టర్లు పెద్దగా పేల లేదు. ‘బ్రహ్మోత్సవం’లో ఆయనకు చోటు దక్కలేదు. ‘అతడు’ సినిమా దగ్గర్నుంచి తన ప్రతి సినిమాలోనూ బ్రహ్మికి చోటిస్తున్న త్రివిక్రమ్.. ఇన్నేళ్ల తర్వాత బ్రహ్మి లేకుండా ‘అఆ’ సినిమా తీసేశాడు. ఆ సినిమా హిలేరియస్ హిట్టయింది. అలాంటి సినిమాలో బ్రహ్మి లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ప్రస్తుతం బ్రహ్మి గురించి ఇండస్ట్రీ ఎక్కడా పెద్దగా చర్చ జరుగుతున్నట్లు లేదు. జనాల డిస్కషన్ల నుంచి కూడా బ్రహ్మి వెళ్లిపోయాడు. మొత్తంగా తెలుగు సినిమా బ్రహ్మిని నెమ్మదిగా మరిచిపోతున్నట్లుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు