దిక్కుతోచని నాగచైతన్య

దిక్కుతోచని నాగచైతన్య

‘దోచేయ్’ డిజాస్టర్ అయినప్పటికీ.. తర్వాత రెండు ఆసక్తికరమైన సినిమాలకు శ్రీకారం చుట్టాడు అక్కినేని నాగచైతన్య. అందులో ఒకటి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘సాహసం శ్వాసగా సాగిపో’ కాగా.. ఇంకోటి మలయాళ బ్లాక్ బస్టర్ ‘ప్రేమమ్’ రీమేక్. ఈ రెండు సినిమాల మీదా మొదలైనప్పటి నుంచి జనాల్లో మంచి ఆసక్తే నెలకొని ఉంది. ఐతే సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల ఈ రెండు సినిమాల్ని అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేని పరిస్థితి. ముందు అనుకున్న ప్రకారమైతే ఈ పాటికి ఈ రెండు సినిమాలూ రిలీజైపోయి ఉండాలి. ఐతే ‘సాహసం శ్వాసగా..’ అనుకోని కారణాలతో వాయిదా పడుతూ రావడంతో దాని ఎఫెక్ట్ ‘ప్రేమమ్’ మీద కూడా పడింది. గౌతమ్ సినిమాను ఎప్పుడో పూర్తి చేయాల్సిన చైతూ.. ఈ మధ్యే ఆ ప్రాజెక్టును ముగించాడు. కొన్ని రోజులు ‘ప్రేమమ్’ను పక్కనబెట్టి మరీ ఆ సినిమాకు పని చేయాల్సి వచ్చింది. ఏదైతే అది అయ్యిందని.. రెండు సినిమాలకూ రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకుని ఈ మధ్యే ప్రకటన కూడా చేశారు. ‘సాహసం శ్వాసగా..’ను జులై 15న.. ‘ప్రేమమ్’ను ఆగస్టు 12న అనుకున్నారు.

కానీ ఈలోపు పరిస్థితులు మారిపోయాయి. రజినీ సినిమా ‘కబాలి’ జులై 1 నుంచి 15కు మారడంతో ‘సాహసం శ్వాసగా..’ డేటు మార్చుకోవాల్సి వస్తుంది. నెలాఖరున రిలీజ్ చేద్దామంటే ఆల్రెడీ ‘బాబు బంగారం’ షెడ్యూలై ఉంది. ‘సాహసం శ్వాసగా..’ విడుదలైతే కానీ.. ‘ప్రేమమ్’ను సంగతి తేలదు. మరోవైపు ఆగస్టు 12న ‘జనతా గ్యారేజ్’ వాయిదా పడుతుందేమో అనుకున్నారు కానీ.. అలా ఏమీ జరగలేదు. క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు పోటీ వెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి అటు ‘ప్రేమమ్’ కానీ.. ఇటు ‘సాహసం శ్వాసాగా..’ సినిమాను కానీ ఆ రోజు రిలీజ్ చేయడం కష్టమే. చూస్తుంటే ఆగస్టు నెలాఖరుకు కానీ.. చైతూకు ఖాళీ దొరికేలా లేదు. అప్పుడో సినిమా రిలీజ్ చేసుకుని సెప్టెంబరు మధ్యలో ఇంకో సినిమాను ప్లాన్ చేసుకోవాలేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు