బావగారితో సినిమా చేయబోతున్న లేడీ డైరెక్టర్

బావగారితో సినిమా చేయబోతున్న లేడీ డైరెక్టర్

సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యామిలీలో అందరూ టాలెంటెడే. ఆయన అల్లుడు ధనుష్ జాతీయ అవార్డు అందుకున్న నటుడు. పెద్ద కూతురు ఐశ్వర్య ‘3’ సినిమాతో దర్శకురాలిగా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నా.. ఆ తర్వాత ‘వై రాజా వై’ అనే చక్కటి థ్రిల్లర్ తీసి తన సత్తా చాటుకుంది. రజినీ చిన్న కూతురు సౌందర్య.. తన తండ్రితో ‘కోచ్చడయాన్’ లాంటి వైవిధ్యమైన సినిమా తీసింది.

ఐతే ఆమెకు కూడా దర్శకురాలిగా తొలి సినిమా చేదు అనుభవాన్నే మిగిల్చినప్పటికీ.. ఈసారి తనేంటో రుజువు చేసుకోవాలని చూస్తోంది. తన బావ ధనుష్‌తోనే ఆమె తన తర్వాతి సినిమాను రూపొందించాలని భావిస్తుండటం విశేషం.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తర్వాతి సినిమా ముచ్చట్లు చెప్పింది సౌందర్య. ‘‘నా తర్వాతి సినిమాకు ప్రి ప్రొకడ్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇది యానిమేషన్ చిత్రం కాదు. వినోదం మేళవించిన విభిన్న ప్రేమ కథా చిత్రంగా ఉంటుంది. మా బావ ధనుష్‌తో కథా చర్చలు జరుపుతున్నా. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాను’’ అని సౌందర్య చెప్పింది.

ఇక తన తండ్రి గురించి.. తనపై ఆయన ప్రభావం గురించి సౌందర్య చెబుతూ.. ‘‘నాన్న చాలా సాధారణ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలకు ఎదిగిన వ్యక్తి. అయినా తన తొలి రోజుల్ని మరిచిపోరు. నాన్న నాకు చెప్పే ప్రధానమైన విషయాలు.. యదార్థంగా, నిజాయితీ ఉండడం అన్నది. ఈ విషయాన్ని నేనెప్పుడూ పాటిస్తాను. ఇంతకు ముందు నేను పుస్తకాలు పెద్దగా చదివేదాన్ని కాదు. రెండేళ్లుగా వివిధ రకాల పుస్తకాలు చదువుతున్నా. అందుకు కారణం నాన్నే. ఆయన కన్నడ రచయిత ఎస్‌ఎల్.బైరప్పకు పెద్ద అభిమాని. ఆయన రాసిన పుస్తకాలను చదవమని చెబుతుంటారు’’ అని చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English