శిష్యులు ద‌ర్శ‌కులు.. గురువులు న‌టులు..

శిష్యులు ద‌ర్శ‌కులు.. గురువులు న‌టులు..

గురువును మించిన శిష్యులు.. ఈ పదం వినడానికి చాలా సంతోషంగా ఉంటుంది కదా..! తమ ప్రతిభను శిష్యులకు ఇచ్చి గురువులు ఎంతో సంబరపడుతుంటారు. తర్వాత వాళ్ల శిష్యులు తమనే మించిపోతే ఇంకా ఆనందిస్తారు.

ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే జరుగుతోంది. కొందరు శిష్యులు ఇప్పుడు తమ గురువులకు తమ సినిమాల్లోనే ప్రత్యేకమైన రోల్స్‌ ఇస్తున్నారు. ఉదాహరణకు త్రివిక్రమ్‌ నే తీసుకోండి. ఈయన పోసాని దగ్గర చాలా ఏళ్ల పాటు పనిచేసాడు. ఆయన దగ్గరే రచనలో ఓనమాలు నేర్చుకున్నాడు. త్రివిక్రమ్‌ దర్శకుడిగా మారిన తర్వాత ప్రతీ సినిమాలోనూ తన గురువు పోసానికి చిన్న పాత్రైనా ఇస్తాడు. మొన్న అ..ఆ లోనూ పోసాని కనిపించాడు.

ఇక మురుగదాస్‌ కూడా ఇప్పుడు ఇదే చేస్తున్నాడు. తన గురువు ఎస్‌ జే సూర్యకు మహేశ్‌ తో తాను తెరకెక్కించబోయే సినిమాలో విలన్‌ వేషం ఇచ్చాడు మురుగదాస్‌. ఎస్‌ జే సూర్య దగ్గర మురుగదాస్‌ కొన్నేళ్ల పాటు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా పని చేసాడనే విషయం చాలా మందికి తెలియదు. సూర్య- అజిత్‌ కాంబినేషన్‌ లో వచ్చిన వాలి చిత్రానికి మురుగదాస్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌. ఆ సినిమా టైమ్‌ లో అజిత్‌ తో ఏర్పడిన పరిచయమే.. ఆయన తొలి సినిమా దినకు ఉపయోగపడింది. ఇప్పుడు సూర్య దర్శకుడిగా ఫామ్‌ లో లేడు.. నటుడిగా బిజీ.

అందుకే తన గురువుకు మహేశ్‌ సినిమా కీలకమైన పాత్ర ఇచ్చాడు. దాసరి విషయంలోనూ ఇదే జరిగింది. తన దగ్గర పనిచేసిన చాలా మంది దర్శకులు.. తర్వాత దాసరికి చాలా సినిమాల్లో మంచి మంచి పాత్రలిచ్చారు. సురేష్‌ కృష్ణ అయితే తన గురువుతో ఏకంగా మేస్త్రీ అనే సినిమానే తీసాడు. మొత్తానికి గురువును మించిన శిష్యుల్ని చూస్తుంటే ఆనందమే కదా..!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు