నాని దెబ్బకు అందరూ మటాష్

నాని దెబ్బకు అందరూ మటాష్

వరుసగా మూడు హిట్లు కొట్టాక కూడా నానిని తక్కువగా అంచనా వేస్తున్నట్లున్నారు టాలీవుడ్ జనాలు. లేకుంటే ‘జెంటిల్‌మన్’ మంచి అంచనాల మధ్య రిలీజవుతున్న సంగతి తెలిసి కూడా నాలుగైదు సినిమాల్ని విడుదల చేయడానికి సాహసించారు. దాని ఎఫెక్ట్ ఏంటన్నది ఇప్పుడే తెలిసొస్తోంది.

శుక్రవారం తెలుగు ప్రేక్షకులకు ‘జెంటిల్‌మన్’ తప్ప మరో సినిమా కనిపించలేదు. సోషల్ మీడియాలో కానీ.. బయట కానీ.. ఇంకే చర్చా జరగలేదు. ఇంద్రగంటి మోహనకృష్ణ ఇంతకుముందు తీసిన ‘బందిపోటు’ డిజాస్టర్ అయినా సరే.. ఆ ప్రభావం ఏమీ ‘జెంటిల్‌మన్’ మీద కనిపించలేదు. తెలుగు రాష్ట్రాల్లో, అమెరికాలో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

ఇక పోటీగా విడుదలైన సినిమాల గురించి పట్టించుకునే నాథుడే లేడు. ఆ సినిమాలకు థియేటర్లు కూడా దొరకలేదు. అల్లు అరవింద్ బ్యాకప్ ఉన్నా.. నిర్మాతలు అల్లు శిరీష్‌కు మిత్రులైనా.. దర్శకుడు ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు రచయిత అయినా సరే.. ‘మీకు మీరే మాకు మేమే’ అనే సినిమాకు ఏమాత్రం హైప్ కనిపించలేదు. హైదరాబాద్ లాంటి చోట్ల ఓ ఏడెనిమిది థియేటర్లలో మాత్రమే రిలీజైందీ సినిమా. అందులోనూ షోలు తక్కువే. దీని టాక్ పర్వాలేదంటున్నారు. కానీ ఎక్కడా పెద్దగా చర్చ జరగట్లేదు.

అలాగే శ్రీకాంత్ అడ్డాల శిష్యుడు రూపొందించిన ‘గుప్పెడంత ప్రేమ’ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. సుకుమార్ వచ్చి ప్రమోట్ చేసిన సాఫ్ట్ వేర్ థ్రిల్లర్ ‘కంట్రోల్-సి’ సంగతీ పట్టించుకునేవాళ్లు లేరు. గాయకుడు, రుద్ర లాంటి సినిమాల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. ఈ పేర్లతో సినిమాలు రిలీజైన సంగతి కూడా జనాలకు తెలియదు. మొత్తానికి ఈ వారం ‘జెంటిల్‌మన్’తో పోటీపడ్డ సినిమాలన్నీ కూడా ఏదో విడుదలయ్యాయంటే విడుదలయ్యాయి అనిపించుకున్నాయంతే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు