మాటీవీ అవార్డుల్లో సిత్రాలు సూడండి

మాటీవీ అవార్డుల్లో సిత్రాలు సూడండి

ఒకప్పుడు నంది అవార్డులకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో సినీ ప్రేక్షకులకు భలే ఎగ్జైట్మెంట్ ఉండేది. కొన్ని సినిమాలు చూస్తున్నపుడే.. ఈ సినిమాకు నంది అవార్డు గ్యారెంటీ అని.. ఫలానా నటుడు అవార్డు సొంతం చేసుకుంటాడని మాట్లాడుకునేవాళ్లు. అవార్డులు ప్రకటించడానికి ముందే ప్రెడిక్షన్లు చేసేవాళ్లు. ఇక ప్రభుత్వం అవార్డులు ప్రకటించాక దాని మీద విశ్లేషణలు జరిపేవాళ్లు. కానీ మూడేళ్లుగా ఆ అవకాశమే లేకపోయింది. రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలైనప్పటి నుంచి నంది అవార్డులు కొండెక్కేశాయి. విభజన తర్వాత అసలు అవార్డుల సంగతి పట్టించుకునే నాథుడే లేడు. ఈ నేపథ్యంలో మాటీవీ ప్రకటించే అవార్డులే మనోళ్లకు కాస్త ప్రెస్టీజియస్‌గా మారాయి. అతిరథ మహారథుల సమక్షంలో ఏటా ఘనంగానే ఈ అవార్డుల కార్యక్రమాల్ని నిర్విహిస్తుంది మాటీవీ. ఈ ఏడాది స్టార్ యాజమాన్యంలో మరింత ఘనంగా వేడుకలు చేశారు.

అవార్డుల విషయానికి వస్తే అర్హత ఉన్నవాళ్లకే ఇచ్చారు కానీ.. ఓ పద్ధతి ప్రకారం అవార్డుల్ని ‘పంచిన’ సంగతి అర్థమవుతుంది. కొంచెం లోతుగా ఆలోచిస్తే.. తెలుగు పరిశ్రమలోని ప్రధానమైన కుటుంబాలన్నింటికీ సంతోషం మిగిల్చేలా అవార్డుల పంపకం జరిగిన సంగతి అర్థమవుతుంది. నందమూరి, మెగా, అక్కినేని, ఘట్టమనేని, దగ్గుబాటి.. ఇలా ప్రధానమైన ఫ్యామిలీలన్నింటినీ అవార్డుల ద్వారా కవర్ చేశారు. అవార్డుల జాబితా చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది. జాతీయ అవార్డుల్లోనే హవా సాగించిన ‘బాహుబలి’కి ఇక్కడ ఏకంగా 13 పురస్కారాలు కట్టబెట్టారు. మామూలుగా అవార్డుకు అర్హత ఉన్నప్పటికీ.. ‘బాహుబలి’ కారణంగా చాలా సినిమాలకు.. చాలామంది ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులకు నిరాశ తప్పలేదు.

పూరి జగన్నాథ్ గత ఏడాది దర్శకత్వం వహించిన రెండు సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించిన హీరో (ఎన్టీఆర్-టెంపర్), హీరోయిన్‌ (ఛార్మి-జ్యోతిలక్ష్మీ)లకు ఉత్తమ నటీనటులుగా అవార్డులు రావడం విశేషం. పూరికి కూడా మాటల రచయితగా అవార్డు వచ్చింది. కంచె హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్‌కు బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్‌గా అవార్డిచ్చారు కానీ.. ఆమె దానికంటే ముందు ‘మిర్చి లాంటి కుర్రోడు’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సంగతి విస్మరించడం గమనార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు